గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

కలం, కరీంనగర్ బ్యూరో: రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని క‌రీంన‌గ‌ర్‌ (Karimnagar) కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. శనివారం నాడు కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో విశ్వ హిందూ పరిషత్‌, భ‌జరంగ్ దళ్, గోరక్ష ప్రముఖ్ తదితర హిందూ మత సంఘాల ప్రతినిధులతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ పండుగ వేళ ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేశారు. పశువుల అక్రమ రవాణా లేదా గోవధకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా, తక్షణమే పోలీసులకు తెలియజేయాలే తప్ప చట్టాన్ని ఉల్లంఘించకూడదని హెచ్చరించారు. అలా కాదని చట్టాన్ని అతిక్రమిస్తే ‘తెలంగాణ గోవధ నిషేధ, జంతు సంరక్షణ చట్టం, 1977’ (Telangana Prohibition of Cow Slaughter and Animal Preservation Act, 1977) ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం

రాష్ట్రంలో గోవుల అక్రమ రవాణాను పూర్తిగా నిషేధించినట్లు సీపీ తెలిపారు. పశువుల రవాణాకు సంబంధించి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రవాణా చేసే పశువులకు సంబంధించి వెటర్నరీ డాక్టర్లు జారీచేసే **‘ఫిట్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్’ పత్రాలు తప్పనిసరిగా తనిఖీ చేస్తారు.

6 వ్యూహాత్మక ప్రాంతాలలో చెక్‌పోస్టులు

పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్‌పోస్టులు, 52 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు పని చేస్తున్నాయని.. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా 6 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఇవి కరీంనగర్ రూరల్ లోని ముగ్ధంపూర్, కరీంనగర్ కొత్తపల్లి మండలం చింతకుంట, చొప్పదండి మండలం ఆర్నకొండ, గంగాధర మండలం తుర్కాసినగర్, తిమ్మాపూర్ మండలం రేణికుంట, హుజురాబాద్‌లోని పరకాల క్రాస్ రోడ్డు వ‌ద్ద ఉన్నాయి.

రెండు వారాల పాటు ఆకస్మిక తనిఖీలు

ఈ చెక్‌పోస్టుల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సరిపడా పోలీసు సిబ్బందిని కేటాయించామని, రానున్న రెండు వారాల పాటు నిరంతరం మరింత పటిష్ట భద్రతను కొనసాగిస్తామని సీపీ తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీపీ హెచ్చరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతని, అందరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం కోరారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రాంచందర్ రావు, సృజన్ రెడ్డి, హిందూ సంఘాల పెద్దలు ఉట్కూరి రాధాకృష్ణ రెడ్డి, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>