కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పిఎస్ పరిధిలోని ఇంద్రేశం (Indresham Robbery) మునిసిపాలిటీ ఎన్ఆర్ఐ సిటిజన్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎన్ఆర్ఐ సిటిజన్ కాలనీలోని ప్రైవేట్ ఉద్యోగి నరసింహారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 40 తులాల వెండి, 20 వేల నగదు, ఒక స్కూటీతో పాటు, చివరకు కిచెన్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో పార్కింగ్ లో ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లిన దుండగులు… అదే స్ధలంలో గుర్తు తెలియని బైకును వదిలివెళ్లడం కొసమెరుపు. ఊరుకు వెళ్లిన నరసింహారావు కుటుంబం, దొంగతనం గురించి స్థానికుల నుంచి తెలుసుకొని వెంటనే ఇంటికి చేరుకున్నారు. సంఘటనపై పోలిసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పటాన్ చెరు పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

