Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ లో కో ఆప్షన్‌ పదవులు దక్కేదెవరికో..?

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంలో ఐదు కో ఆప్షన్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. గురువారం సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగియగా 45 అప్లికేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 17, 18, 19 తేదీల్లో అప్లికేషన్లను స్క్రూట్నీ చేసి తుది అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ నెల 31 తేదీలోపు జరిగే సమావేశంలో కో ఆప్షన్ అభ్యర్థుల ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం కరీంనగర్ నగర పాలక సంస్థలో 66 మంది కార్పొరేటర్లు, కరీంనగర్, మానకొండూరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కలిపి మొత్తం 69 మంది ఓటర్లు కలిసి ఐదురుగు కో ఆప్షన్ మెంబర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఐదు కో ఆప్షన్ పదవుల్లో రెండు మైనార్టీలకు, మూడు జనరల్ కేటాగిరీకి కేటాయించగా, మైనార్టీలో ఒకటి, జనరల్ కేటాగిరీలో మరొకటి కలిపి రెండు స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. మిగిలిన మూడు స్థానాల్లో పురుషులు లేదా మహిళలు పోటీ చేసే అవకాశముంది.

పార్టీల బలాబలాలివే..

ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ లో 35 ఓట్ల బలం కలిగిన బీజేపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశముంది. కాంగ్రెస్ లో గెలిచిన 14 మంది కార్పొరేటర్లు, ఆ పార్టీలో చేరిన నలుగురు కార్పొరేటర్లు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ఓటుతో కలిపితే ఆ పార్టీ బలం 19గా ఉంది. బీఆర్ఎస్ నుంచి 9 మంది కార్పొరేటర్లు గెలవగా.. ఒక ఇండిపెండెంట్ ఆ పార్టీలో చేరారు. అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓటు ఒకటి కలిపితే ఆ పార్టీ బలం 11కు చేరింది. ఎంఐఎం నుంచి ముగ్గురు గెలవగా.. వారికి ఇండిపెండెంట్ ఒకరు తోడు కావడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. బీజేపీయేతర పార్టీలన్ని జతకడితే 33 ఓట్లు ఉంటాయి.

బీఆర్ఎస్ నుంచి అత్యధిక అప్లికేషన్లు..

కార్పొరేషన్ పాలకవర్గంలో బీఆర్ఎస్ కు కేవలం 11 ఓట్లే ఉన్నా ఆ పార్టీ నుంచి అత్యధికంగా 16 దరఖాస్తులు రావడం గమనార్హం. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు దిండిగాల మహేష్, జంగిలి ఐలేందర్ యాదవ్, జంగిలి సాగర్, గందె మాధవి, కమల్జీత్ కౌర్, మాజీ ఎంపీటీసీ భూక్యా తిరుపతి, భూక్యా లావణ్య తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ కౌన్సిలర్లు అర్ష మల్లేశం, అర్ష కిరణ్మయితోపాటు మరో మైనార్టీ నేత కోఆప్షన్ పదవిని ఆశిస్తూ దరఖాస్తులు సమర్పించారు. బీజేపీ తరఫున జనరల్ విభాగం నుంచి కన్న కృష్ణ, నందకుమార్, జనరల్ మహిళా విభాగం నుంచి చిగిరి వెంకటమ్మ, మైనారిటీ విభాగం నుంచి బల్బీర్ సింగ్, మైనార్టీ మహిళా విభాగం నుంచి హఫీజాబేగం ఆ పార్టీ మద్ధతును ఆశిస్తున్నారు. వీరినే బీజేపీ బలపరిచే  ఛాన్స్ ఉంది. చేతులు ఎత్తే విధానంతోనే ఎన్నిక జరగనున్నట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>