కలం, కరీంనగర్: కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మంగళవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కమిటీ ( Karimnagar Congress) కార్యాలయంలో ఘనంగా ప్రారంభమైంది. చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పీసీసీ పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఫక్రుద్దీన్ హాజరయ్యారు. రెండు మండలాల అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో పరిశీలకులు విడివిడిగా సమావేశమై, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు.
ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తాం..
ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి ఫక్రుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్టపడిన అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాము పరిశీలకులుగా వచ్చామన్నారు. సంపూర్ణ ప్రజాస్వామ్యబద్ధంగా, పార్టీ శ్రేణుల సమక్షంలోనే అధ్యక్షుల నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పీసీసీ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల ప్రకారం 80 శాతం పదవులను పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే కేటాయిస్తామని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నాయకత్వంలో పనిచేస్తూ, పార్టీని మరింత బలోపేతం చేసే నాయకులను ఎంపిక చేయడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
త్వరలోనే ప్రకటన..
ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తిస్తామని అన్నారు. త్వరలోనే సమర్థులైన నాయకులను మండల అధ్యక్షులుగా ప్రకటిస్తామని తెలిపారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పదవులు దక్కేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

