కలం, రాజన్నసిరిసిల్ల: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ (Rajanna Sircilla BJP) అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో సీఎంరేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
దాడి చేయడం అప్రజాస్వామికం..
ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై సిరా పోయడం, విధ్వంసానికి పాల్పడటం అత్యంత అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాజకీయంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ ఈ దాడులకు తెగబడుతోందని విమర్శించారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఆందోళనకరమని, బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేయడం, విచారణకు వెళ్తున్న రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలోనూ భద్రతా వైఫల్యాలు ఎదురవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
రాజ్యాంగం పట్టుకుని తిరిగితే సరిపోదు..
రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరిగితే సరిపోదని, రాజ్యాంగ స్ఫూర్తిని పాలనలో చూపాలని ఆయన తెలిపారు. బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, దానిని చేతకానితనంగా భావిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శులు కర్నె హరీష్, మీసా సంజీవ్, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు ఉడుగుల యాదగిరి, కిరణ్ నాయక్, పట్టణ, మండల అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, బుర్ర శేఖర్ గౌడ్, కోడె రమేష్, మల్యాల మారుతి, రేపాక రామచంద్రం, మీరాల్కర్ బాలాజీ, మోకిలే విజయేందర్, కర్ణబత్తుల వేణుగోపాల్, బూరుగుపల్లి పరమేష్, సౌల్ల క్రాంతి, రాపెల్లి శ్రీధర్, డాక్టర్ సత్యనారాయణ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

