కలం, ఖమ్మం బ్యూరో: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం బయటపడుతోంది. ఖమ్మం (Khammam) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కవిరాజ్ నగర్లో నివాసముంటున్న 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సరిపూడి రమాదేవి ఓటు హక్కు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి గల్లంతైంది. ఎన్యుమరేషన్ ఫారాన్ని స్వీకరించి, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినప్పటికీ ఆన్లైన్ డ్రాఫ్ట్ జాబితాలో రమాదేవి ఓటు కనిపించలేదు. ఆన్లైన్ నమోదులో బీఎల్వో శోభ నిర్లక్ష్యం వహించారని డివిజన్ సూపర్వైజర్ దివ్య ఆరోపించారు. మాజీ ప్రజాప్రతినిధి ఓటుకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని రమాదేవి ప్రశ్నించారు. ఈ ఘటనపై సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుని, తన ఓటును పునరుద్ధరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు బూత్ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే ప్రక్రియలో పొరపాట్లకు తావులేకుండా చూడాలని, తప్పుడు తొలగింపులు చేయకుండా బీఎల్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరించారు.

