కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌లో ఉన్న శ్రీగిరి క్షేత్రం (Sri Giri Temple) శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి రెండు వేల మందికి పైగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు కావడి సేవ, రథ సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల సహకారంతో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీగిరి క్షేత్రం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి మంగళవారం నిర్మల్ పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

