Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రి ఇలాకాలోనే ఇలా.. అధ్వానంగా కరీంనగర్ బస్టాండ్‌!

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ తర్వాత అతిపెద్ద బస్టాండ్‌గా పేరుగాంచిన కరీంనగర్ (Karimnagar) ప్రధాన బస్ స్టేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం.. బస్సులు బయటకు వెళ్లే ప్రధాన ద్వారం అంతా గుంతలమయం.. ఉన్నా పనిచేయని సీసీ కెమెరాలు.. ఇలా అన్నీ సమస్యలే!! సాక్షాత్తు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఇది. ఇక్కడ చాలా మంది అధికారులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కౌంటర్ దగ్గరికి ఎవరైనా ప్రయాణికులు సమాచారం కోసం వెళ్తే సరైన సమాధానం అందడం లేదు. పైగా రాత్రి పూట మహిళ ఉద్యోగులకు కావాలనే డ్యూటీలు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కౌంటర్లలో గందరగోళం

బస్టాండ్‌లో ప్రయాణికులకు దిశానిర్దేశం చేయాల్సిన సమాచార కేంద్రాలు కాలక్షేపపు ముచ్చట్లకు నిలయాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. కనీస సమాచారం అడిగినా అక్కడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. రిజర్వేషన్ కౌంటర్లలో కనీసం మైక్ సౌకర్యం కూడా లేదు.

మహిళలకు నైట్ డ్యూటీలు

ఔట్‌సోర్సింగ్ మహిళా సిబ్బందిపై కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీలు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు మానసిక వేదనకు గురవుతున్నారు.

పరిశుభ్రతా.. పట్టింపేలేదు!

ఖర్చుల తగ్గింపు పేరుతో ఔట్ సోర్సింగ్ స్వీపర్ ఉద్యోగుల సంఖ్యను కుదించడంతో బస్టాండ్ ఆవరణలో పరిశుభ్రత పూర్తిగా లోపించింది. ఎటు చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. బస్సులు బయటకు వెళ్లే ప్రధాన ద్వారం వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయమైంది. దీంతో అటు బస్సులు ప్రయాణించడానికి, ఇటు పాదచారులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్టాండ్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ.. అవి సగానికి పైగా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

అకస్మాత్తుగా బస్సుల నిలిపివేత

ఇటీవల వరుస ప్రమాదాల్లో ఎలక్ట్రిక్ బస్సులు మంటల్లో చిక్కుకున్న ఘటనల నేపథ్యంలో కరీంనగర్ డిపోకు చెందిన సుమారు 104 ఎలక్ట్రిక్ బస్సులను అకస్మాత్తుగా ఆపేశారు. ముందస్తు ప్రకటన కానీ, సమాచారం కానీ లేకుండా ఇలా ఆపేయడంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రూట్లయిన హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, గోదావరిఖని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత కొన్ని బస్సులను పునరుద్ధరించినప్పటికీ.. రద్దీకి సరిపడా సర్వీసులు మాత్రం లేవు.

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు..!

బస్టాండ్‌లోని దుకాణాలు, హోటళ్ల నిర్వాహకులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులను అమ్ముతున్నారు. అలా అమ్మొద్దని పైనుంచి ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రయాణికులు నిలదీస్తే.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే సమాధానం వస్తున్నది. ఎమ్మార్పీ కంటే పది ఇరవై రూపాయలు ఎక్కువకే అమ్ముతున్నారని ప్రయాణికులు అంటున్నారు.

ప్రయాణికుల ఓపీనియన్స్ ఇలా..

”హైదరాబాద్ వెళ్లేందుకు కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చాను. దాదాపు రెండున్నర గంటల నుంచి హైదరాబాద్ బస్సుకోసం వెయిట్ చేసిన. ఎక్స్ ప్రెస్ బస్సు కోసం చూసినా దిక్కు లేదు. ఆర్డినరీ బస్సు కానరావడమే లేదు. కౌంటర్లలో అడిగినా సమాచారం ఇవ్వడం లేదు. ఇంతగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న నాథుడే లేదు. బస్సుల ఆల్టర్నేట్ ఆలోచనే లేదు. ఎలక్ట్రిక్ బస్సులన్నీ డిపోలోకే పరిమితం చేశారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం” అని కుమార్ అనే వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ”మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం బాగున్నా.. కరీంనగర్ బస్టాండ్ లో ఎప్పుడూ సౌకర్యాలు కనిపించడం లేదు. బస్సుల సమయపాలన లేదు.. కౌంటర్లలో సమాధానం దిక్కు లేదు.. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. వివిధ పనులు, ఉద్యోగాలు, ముఖ్యమైన పనుల కోసం వెళ్లేవారి పరిస్థితి కష్టంగా ఉంది. ఎక్స్ ప్రెస్ లు లేకుంటే ఆల్టర్నేట్గా ఆర్డినరీ బస్సులైనా ఏర్పాటు చేయొచ్చు కదా?” అని మరో వ్యక్తి తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>