Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యే యెన్నం చొరవతో ఆశాకార్యకర్తలకు ప్రత్యేక నిలయం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో ఆశా కార్యకర్తలు కీలక భూమిక పోషిస్తున్నారు. తల్లీ-శిశు ఆరోగ్య పరిరక్షణ నుండి వ్యాధి నిరోధక చర్యల వరకు, ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడం నుండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడం వరకు వారి సేవలు అమూల్యమైనవి.

ఈ నేపథ్యంలో వారి సేవలను గుర్తిస్తూ, వారికి గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విప్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే (Mahabubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో తన ‌ఎస్డీఎఫ్ నిధులతో ఆశా కార్యకర్తల కోసం “ ఆశా నిలయం ” నిర్మించారు.

ఈ నిలయం కేవలం విశ్రాంతి కేంద్రం మాత్రమే కాదు,ఆశా కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి రోజు గ్రామాల నుంచి వందలాది మంది రోగులను ఆసుపత్రులకు తీసుకువచ్చి, వారికి ఆరోగ్య సేవలు అందేలా కృషి చేసే ఆశా కార్యకర్తలు మాత్రం ఆసుపత్రుల్లో ఎక్కువసేపు ఉండేందుకు సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆసుపత్రిలో ఉండే సెక్యూరిటీ సిబ్బంది కూడా వారిని ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఉండనీయని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే , ఆశా కార్యకర్తల కోసం ప్రత్యేక విశ్రాంతి స్థలం అవసరమని భావించి, జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఆశా నిలయాన్ని నిర్మించించారు.రోజంతా కష్టపడి సేవలు అందించే ఆశా కార్యకర్తలకు విశ్రాంతి తీసుకునే స్థలం, సమావేశాలు నిర్వహించుకునే వేదిక, అవసరమైన సమాచారం పొందే కేంద్రంగా “ఆశా నిలయం” రూపుదిద్దుకుంది.

ఇక్కడ వారు పరస్పరం కలుసుకుని అనుభవాలను పంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా సాధ్యమవుతోంది. ఈ కేంద్రంలో తాగునీరు, విశ్రాంతి గదులు, సమావేశాల కోసం ప్రత్యేక ప్రదేశం, శానిటేషన్ సదుపాయాలు వంటి ప్రాథమిక వసతులు కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.

ఈ విధంగా ఆశా కార్యకర్తల పనితీరును మెరుగుపరచడంలో ఆశా నిలయం కీలక పాత్ర పోషించనుంది. అత్యంత ముఖ్యంగా, ఆశా కార్యకర్తలు సమాజంలో గౌరవంతో నిలబడేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. వారు ఎదుర్కొనే సవాళ్లను తగ్గిస్తూ, వారికి అవసరమైన మద్దతు అందించడం ద్వారా వారి సేవలను మరింత ప్రభావవంతంగా మార్చడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఆశా విశ్రాంతి నిలయంను నిర్మించడం విశేషం. ఇది ఆశా కార్యకర్తల పట్ల ఆయన చూపుతున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ఆరోగ్య సేవలు మరింత బలోపేతం కావడంతో పాటు, ఆశా కార్యకర్తలకు ప్రోత్సాహం లభించి వారు మరింత ఉత్సాహంతో సేవలను కొనసాగించగలరని ఆశాభావం వ్యక్తమవుతోంది. సమాజ ఆరోగ్యాభివృద్ధిలో ఆశా కార్యకర్తల పాత్రను మరింత బలపరిచే ఈ నిలయం ఒక ఆదర్శవంతమైన ముందడుగుగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>