కలం, వెబ్‌డెస్క్: హిందూ సనాతన ధర్మంలో ప్రతీ సంప్రదాయానికి ఒక ప్రత్యేక నేపథ్యం ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి ఉదయం కళ్ళు తెరవగానే మన “అరచేతులను దర్శించుకోవడం” (కర దర్శనం) (Karadarshanam). చాలా మంది దీనిని కేవలం దైవచింతనగా భావిస్తారు. కానీ ఈ ఆచారం వెనుక మానసిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మీకు తెలుసా? అవును నిద్ర లేవగానే అరచేతులను చూడటం వెనుక ఉన్న అసలు రహస్యం, ఆధ్యాత్మిక, ఆరోగ్య కోణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కరదర్శనం అంటే ఏమిటి?
“కర” అంటే చేయి, “దర్శనం” అంటే చూడటం. అంటే ఉదయం నిద్రలేవగానే కొన్ని క్షణాలు మన రెండు అరచేతులను చూసుకుంటూ ఒక పవిత్రమైన శ్లోకాన్ని స్మరించుకోవడం కరదర్శనం అని పిలుస్తారు.
‘కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ।
కరమూలే స్థితో గోవిందః ప్రభాతే కరదర్శనం॥’
ఈ శ్లోకం ప్రకారం చేతి వేళ్ల చివరల్లో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతీదేవి, చేతి మూల భాగంలో శ్రీమహావిష్ణువు నివసిస్తారని పెద్దల విశ్వాసం. అయితే కరదర్శనం కేవలం దేవతలను స్మరించుకోవడమే కాదు, జీవిత విజయానికి అవసరమైన మూడు ముఖ్యమైన అంశాలను గుర్తు చేస్తుందని సూచిస్తున్నారు పండితులు.
ఐశ్వర్యానికి ప్రతీక లక్ష్మీదేవి
మానవ జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఎంతో ముఖ్యమని మనకు తెలుసు. కష్టపడి పనిచేసి సంపదను సంపాదించాలి, దానిని సద్వినియోగం చేయాలి అనే భావనను లక్ష్మీదేవి సూచిస్తుందని చెబుతారు.
జ్ఞానానికి ప్రతీక సరస్వతీదేవి
కేవలం డబ్బు ఉంటే సరిపోదు. డబ్బుతో పాటు జ్ఞానం కూడా అవసరం. అందుకే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, జీవితంలో ముందుకు సాగడానికి విద్య, వివేకం, తెలివితేటలు కీలకం. కాబట్టి సరస్వతీదేవిని చేతి మధ్య భాగంలో ప్రతిష్ఠించారని అర్థం.
రక్షణ, ధర్మానికి ప్రతీక గోవిందుడు
సంపద, జ్ఞానంతో పాటు ధర్మబద్ధమైన జీవనం గడపం ఎంతో ముఖ్యం. అందుకే జీవితంలో సమతుల్యత, నీతి, దైవభక్తి అవసరమని విష్ణుమూర్తి స్మరణ మనకు తెలియజేస్తుందని అర్థం.
అందువల్ల, ఉదయం నిద్ర లేవగానే ఇలా ముగ్గురు దేవతలకు నిలయమైన మన అరచేతులను దర్శించుకోవడం ఎంతో శ్రేయస్కరమని సూచిస్తారు నిపుణులు.
మానసికంగా కలిగే ప్రయోజనాలు
ఉదయం లేవగానే ఈ శ్లోకాన్ని స్మరించడం వల్ల రోజంతా మంచి ఆలోచనలు, చైతన్యం, సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. కృతజ్ఞత భావం, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత మెరుగుపడి రోజు లక్ష్యాలను గుర్తు చేసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.
శాస్త్రీయ కోణంలో చూస్తే
1. కంటి నరాల రక్షణ
మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు కంటి గుడ్డు వెనుక ఉండే నరాలు, మెదడు విశ్రాంతి స్థితిలో ఉంటాయట. నిద్ర లేవగానే ఒక్కసారిగా గదిలోని లైట్లు లేదా సూర్యకాంతిని చూడటం వలన కంటి నరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. కాబట్టి ముందుగా అరచేతులను చూడటం వల్ల, కళ్ళు తక్కువ వెలుతురుకు అలవాటుపడి , ఆ తర్వాత ఎక్కువ వెలుతురును తట్టుకునేలా సిద్ధమవుతాయని చెబుతున్నారు.
2. మెదడు చురుకుదనం
నిద్రలో ఉన్న మెదడు ఒక్కసారిగా యాక్టివ్ మోడ్‌లోకి రాలేదు. లేవగానే అరచేతిలోని రేఖలను, వేళ్లను నిశితంగా గమనించడం వల్ల మెదడుకు “మనం నిద్ర లేచాం” అనే స్పష్టమైన సంకేతం అందుతుంది. ఇది మెదడును నిద్రావస్థ నుండి మెల్లగా చురుకైన స్థితికి మారుస్తుందట.
3. పామింగ్ ప్రక్రియ
మన పెద్దలు నిద్ర లేవగానే రెండు అరచేతులను ఒకదానికొకటి బాగా రుద్ది (రబ్ చేసి), ఆ వేడిని కళ్లపై అద్దుకుని, ఆ తర్వాత చేతులను దూరం జరిపి చూడమని చెబుతారు. సైన్స్‌లో దీనిని ‘పామింగ్’ (Palming) అంటారు.

