Mobile Popup Ad
Mobile Popup Ad

‘బంగారు అభ‌ర‌ణాల‌ను త‌ళ‌త‌ళ‌లాడిస్తాం’ పేరుతో మోసం

క‌లం, మెద‌క్ బ్యూరో: ‘బంగారు ఆభరణాలను కొత్తవాటిలా మెరిపిస్తాం.. నిమిషాల్లో తళతళలాడేలా చేస్తాం’ అని మ‌హిళ‌ల‌ను న‌మ్మించి, ఆపై రసాయనాలతో బంగారాన్ని కరిగించి దోచుకెళ్లిన సంఘ‌ట‌న సిద్ధిపేట జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేట జిల్లా తొగుట (Thoguta) మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో శనివారం ఇద్దరు అపరిచిత యువకులు కలకలం సృష్టించారు. చేతిలో ప్రత్యేక పౌడర్, లిక్విడ్ బాటిళ్లతో గ్రామంలోకి ప్రవేశించిన వీరు.. ఇళ్ల ముందున్న మహిళలను ల‌క్ష్యంగా మాట‌లు క‌లిపారు.

తమ వద్ద ఉన్న ప్ర‌త్యేక‌మైన‌ కెమికల్స్‌తో పాత బంగారం, వెండి ఆభరణాలను నయా పైసా ఖర్చు లేకుండా కొత్తవాటిలా మెరిపిస్తామని నమ్మించే ప్ర‌యత్నం చేశారు. అయితే న‌కిలీ గాళ్ల మాటలను నమ్మకుండా పలువురు గ్రామస్తులు వీరిని తిప్పి పంపించేశారు.ఎలాగైనా ఎవరినో ఒకరిని బుట్టలో వేయాలనుకున్న ఆ కేటుగాళ్లు.. చివరకు గ్రామానికి చెందిన కళ్లెపు అనూష అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆమెకు నమ్మకం కలిగించేందుకు ముందుగా ఆమె చేతులపై పౌడర్ వేసి రంగు మార్చి మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన అనూష.. తన మెడలోని బంగారు పుస్తెల తాడును, అలాగే ఆమె చెల్లి కాళ్లకున్న వెండి పట్టీలను క్లీన్ చేయడానికని వారి చేతికి ఇచ్చింది.

సమయం కోసం వేచి చూస్తున్న ఆ దొంగలు.. తాము తెచ్చుకున్న ఒక రసాయన ద్రావణంలో ఆ ఆభరణాలను ముంచారు. కెమికల్ రియాక్షన్ వల్ల పైకి ఆభరణాలు మెరుస్తున్నట్లు కనిపించినా.. లోపల మాత్రం బంగారం కరిగిపోయింది. ఆ తర్వాత ఆ నగలను అనూషకు ఇచ్చేసి, కాసేపటి వరకు వాటిని ముట్టుకోవద్దని చెప్పి నిందితులు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు.

అయితే కాసేపటికి ఆభరణాలను చేతిలోకి తీసుకున్న బాధితులకు ఏదో తేడా కొట్టింది. నగలు చాలా బరువు తగ్గినట్లు అనిపించడంతో వెంటనే స్థానిక బంగారు అభ‌ర‌ణాల షాపుకునకు వెళ్లి తూకం వేయించారు. షాప్‌లో తూకం వేసి చూశాక బాధితురాలు అనూష‌ గుండె గుభేల్‌మంది. మూడు తులాల (34.99 గ్రాములు) పుస్తెల తాడు బంగారం కరిగిపోయి, 21.69 గ్రాములు వచ్చింది. దీంతో క్లీనింగ్ పేరుతో దారుణంగా మోసపోయామని గ్రహించిన బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.

ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ కష్టపడి చేయించుకున్న నగలను, ప‌ట్ట‌ప‌గలు కేటుగాళ్ల క‌రిగించి మాయమవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తొగుట పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంగారు న‌గ‌ల‌ క్లీనింగ్ పేరుతో వస్తున్న కేటుగాళ్ల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని ,ఎవ‌రైనా రసాయనాలతో బంగారాన్ని కొత్తగా చేస్తామని చెబితే వెంట‌నే సమాచారం ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>