కలం, వెబ్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీలో ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సత్తా ఉందని, ఆయన మరికొంత కాలం కొనసాగి ఉంటే బాగుండేదని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ 2025 మే నెలలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. తన 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌లో ఆయన 123 మ్యాచ్‌లు ఆడి, 30 సెంచరీలతో 9,230 పరుగులు చేశారు.
అంతేకాకుండా 68 మ్యాచ్‌ల్లో 40 విజయాలతో భారతదేశపు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచారు. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు ముందే తాను టెస్ట్ క్రికెట్‌కు అవసరమైనదంతా ఇచ్చేశానని చెబుతూ ఆయన ఆటకు గుడ్‌బై చెప్పారు. కోహ్లీ నిర్ణయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవడం తనకు నచ్చలేదని చెప్పారు. ఇది పరుగులు లేదా రికార్డుల గురించిన విషయం కాదని అన్నారు.
ఒకవేళ కోహ్లీ ఆరు నెలల పాటు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండి ఉంటే, మళ్లీ భారత్‌కు ఆడే అవకాశం వచ్చేదని అభిప్రాయపడ్డారు. సెలక్టర్లు లేదా కెప్టెన్ జట్టులోకి తీసుకోకపోయినా పర్వాలేదని, మళ్లీ కష్టపడి డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగులు సాధించి జట్టులోకి తిరిగి వచ్చే సత్తా కోహ్లీకి ఉందని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కోహ్లీ దూకుడును టెన్నిస్ దిగ్గజం జాన్ మెక్‌ఎన్రోతో కపిల్ దేవ్ పోల్చారు. కొందరు ఆటగాళ్లు మైదానంలో సవాళ్లను ఎదుర్కొంటూనే అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని చెప్పారు. రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్లు ప్రశాంతంగా ఉంటూ పరుగులతోనే సమాధానం చెబుతారని.. కానీ కోహ్లీ మాత్రం మెక్‌ఎన్రోలా ఎప్పుడూ పోరాడుతూ ఉంటారని అన్నారు. కోహ్లీ అంత దూకుడుగా ఉండటం వల్లనే తన ప్రదర్శన మరింత మెరుగవుతుందని నమ్మి ఉండవచ్చని, అలా అనుకునే హక్కు ఆయనకు ఉందని కపిల్ దేవ్ ముగించారు.

