కలం, నిజామాబాద్ బ్యూరో: హార్వెస్టర్ మిషన్ అద్దెకు ఇస్తామంటూ నమ్మించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ముఠాను కామారెడ్డి (Kamareddy) జిల్లా దోమకొండ పోలీసులు పట్టుకున్నారు. గతంలో జైలులో పరిచయమైన నలుగురు కలిసి పక్కా పథకం ప్రకారం ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.బాధితుడిని కారులో అపహరించి దాడి చేయడంతో పాటు నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. మరోసారి కిడ్నాప్ చేసేందుకు వస్తుండగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దోమకొండ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన చెందం మురహర్ హార్వెస్టర్ మిషన్‌ను లీజుకు తీసుకుని వరి కోతల పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో మిషన్ అద్దెకు ఇస్తామంటూ నమ్మించిన కొందరు నిందితులు అతడితో పరిచయం పెంచుకున్నారు.
సుమారు నెల రోజుల పాటు ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడి నమ్మకం కలిగించి, అక్టోబర్ 22న మిషన్ చూపిస్తామంటూ కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. మార్గమధ్యంలో బాధితుడిపై దాడి చేసి, సెల్‌ఫోన్‌తో పాటు 2,500 నగదును దోచుకున్నారు. అయితే ఇందల్వాయి ప్రాంతంలో నిందితులు ఓ దాబా వద్ద మద్యం సేవించి భోజనం చేసి నిద్రించారు. ఆ సమయంలో వారి చెర నుంచి తప్పించుకున్న బాధితుడు మురహరి గ్రామస్తులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. బాధితుడిని మరోసారి కిడ్నాప్ చేసేందుకు నవంబర్ 9న అదే కారులో కోనాపూర్‌కు బయలుదేరిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కిడ్నాప్, దోపిడీ నేరాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు.
గతంలో జైలులో పరిచయమైన నలుగురు నేరస్తులు కలిసి నేరానికి పథకం రచించినట్లు తెలిపారు. నిందితులపై గతంలో హత్య, దొంగతనం తదితర కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి కిడ్నాప్ నకు ఉపయోగించిన ఎర్టిగా కారు, నాలుగు సెల్ఫోన్లు, ఒక బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన డిటెక్టివ్ సీఐ నరేష్, దోమకొండ ఎస్ఐ ప్రభాకర్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Also Read : ఉద్యోగుల సస్పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు
Follow Us On : WhatsApp

