కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజావాణిలో అందిన దరఖాస్తులను (Prajavani Applications) సత్వరమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ డి జానకి (SP Janaki) ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను జిల్లా ఎస్పీ డి.జానకి, స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి నుంచి వినతులను స్వీకరించారు.
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, చట్టపరిధిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

