కలం, నిజామాబాద్ బ్యూరో: సాధారణంగా ఎన్నికలు రాగానే రోడ్లు వేయిస్తాం, నీటి సమస్య తీరుస్తాం అని అభ్యర్థులు హామీలు ఇవ్వడం కామన్. కానీ కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మాత్రం ఓటర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. తనను గెలిపిస్తే వార్డులోని ఓటర్లందరినీ ఏటా ఒకసారి తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.
కామారెడ్డి పురపాలక సంఘం (Kamareddy Municipality) 8వ వార్డు నుంచి జనసేన (Janasena) అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మీనర్సాగౌడ్ తన మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. గెలిచిన తర్వాత వార్డు వాసులను తన సొంత ఖర్చులతో తిరుమలకు తీసుకెళ్లడమే కాకుండా, అక్కడ వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తానని కరపత్రాల ద్వారా హామీ ఇస్తున్నారు.
ఆధ్యాత్మిక హామీలతో పాటు రాజకీయంగానూ ఆసక్తికర హామీని ఆయన ఓటర్ల ముందు ఉంచారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కామారెడ్డికి తీసుకొస్తానని, హౌసింగ్ బోర్డు కాలనీలోని సంకష్టహర గణపతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. కేవలం ఆధ్యాత్మిక అంశాలే కాకుండా, వార్డు అభివృద్ధికి సంబంధించి మరో 13 హామీలను ఆయన ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ ‘వెరైటీ’ ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ లక్ష్మీనర్సాగౌడ్ వార్డులో హాట్ టాపిక్‌గా మారారు.
Read Also: విద్యుత్ స్తంభాలు, గృహ కనెక్షన్లపై కీలక మార్పులు
Follow Us On: Pinterest


