క్రీడా పండుగకు తెలంగాణ సిద్ధం.. అధికారులకు సీఎం దిశానిర్దేశం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో క్రీడా సంబరాలకు రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా పోటీల (Khelo India Games) ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు, గచ్చిబౌలిలో ముగింపు వేడుకలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

పోటీల సందర్భంగా నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఉండాలని స్పష్టం చేశారు. ఇందుకోసం పోలీస్, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేయాలని, ఒక్కో విభాగానికి ఒక్కొక్కరిని ఇంచార్జులుగా నియమించి బాధ్యులను చేయాలని సూచించారు.

పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లాలవారీగా మంత్రులకు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇంచార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు.

అలాగే మహబూబ్ నగర్ పరిధిలో జూపల్లి కృష్ణారావు, వరంగల్ పరిధిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ పరిధిలో అడ్లూరి లక్ష్మణ్ కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్నారు. ఖమ్మం పరిధిలో తుమ్మల నాగేశ్వర్ రావు, నిజామాబాద్ పరిధిలో సుదర్శన్ రెడ్డికి పోటీల ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వాలని ఆదేశించారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే క్రీడాకారులు, ఆహ్వానితులకు అందించే ఆహారం, వసతి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. స్టేడియంల పునరుద్ధరణతో పాటు ఇతర ఏర్పాట్లలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

తెలంగాణలో క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు దేశంలోనే అత్యుత్తమ కోచ్ లను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

Also Read : ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. 11 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>