కలం, వెబ్ డెస్క్: తెలంగాణ స్థానికతపై 600 సంవత్సరాలుగా దాడి జరుగుతూనే ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల స్థానికత అంశంపై హైకోర్ట్ కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ‘తెలంగాణ స్థానికత – సవాళ్లు’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తామే ఆ పని చేస్తామని కూడా స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని తెలంగాణ స్ఫూర్తిని జడ్జిలు అర్థం చేసుకోవాలని విన్నవించారు.
రాజ్యాలే కూలిపోయాయి..
స్థానికత వివాదంతో బహుమనీ రాజ్యమే కూలిపోయి, అయిదు ప్రాంతాలుగా విడిపోయిందని కవిత పేర్కొన్నారు. వాటిలో ఒకటైన గొల్కోండను పాలించిన అసఫ్ జాహీలు స్థానికత అంశాన్ని అర్థం చేసుకుని 1868, 1919, 1935 ప్రాంతాల్లో రూల్స్ తెచ్చారని గుర్తు చేశారు. 15 ఏళ్లు నిజాం సంస్థానంలో ఉన్నవారే స్థానికులుగా గుర్తిస్తామని ఫర్మానాలు జారీ చేశారన్నారు.
అయితే, అవి పెద్దగా అమలు కాలేదన్నారు. చివరికి 1956లో తెలంగాణ, ఏపీ విలీనం అయినప్పుడు 15 ఏళ్ల నిబంధనను 12 సంవత్సరాలకు కుదించారన్నారు. 1969లో ఆరు సూత్రాల ప్రకటనలో 12 ఏళ్లు కాస్తా నాలుగేళ్లకు పడిపోయిందన్నారు. అక్కడి నుంచి ఉద్యోగాల్లో ఉల్లంఘనలు తీవ్రతరం అయ్యాయని వివరించారు.
గ్రూప్–1 ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం..
గతేడాది నిర్వహించిన 563 గ్రూప్–1 ఉద్యోగాల నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తుది ఎంపికలో ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంటే.. 11 మందికి అవకాశం కల్పించారన్నారు. ఈ క్రమంలో 5 శాతం స్థానికేతరుల కోటాలో ఇతర రాష్ట్రాల వారు ఈడబ్ల్యూఎస్, బీసీ–డీ సర్టిఫికేట్లు పొంది ఉద్యోగాలు సాధించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంటే, 200 మంది బయట రాష్ట్రాల వారికే కొలువులు వచ్చాయని.. ఫలితంగా తెలంగాణ పిల్లలు నష్టపోయారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గ్రూప్–1 నియామకాలపై జ్యుడీషియల్ కమిషన్ వేసి రివ్యూ చేస్తామని స్పష్టం చేశారు.

