హనుమకొండలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరానికి ఉన్న ఘనమైన చరిత్రను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం హనుమకొండ (Hanumakonda) బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా), కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు బీవీ పాపారావు, బీపీ ఆచార్య, ప్రొఫెసర్ పాండురంగారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ జిల్లా చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో పాండురంగారావు, పాపారావుల వంటి వారు చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు. కాకతీయ సామ్రాజ్యానికి కేంద్రంగా నిలిచిన వరంగల్ చరిత్రను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు ఈ కళా సంపదను అందించాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ వరంగల్ సాంస్కృతిక నగరంగా పేరుగాంచింది అని తెలిపారు. వరంగల్ కోట, రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, లక్నవరం వంటి అనేక చారిత్రక ప్రదేశాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయని అన్నారు. ఈ వారసత్వ సంపదను కాపాడి, యువతకు పరిచయం చేయడం అవసరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, వరంగల్ అంటేనే కాకతీయ సామ్రాజ్యానికి నిలయం అని అన్నారు. కవులు, కళాకారులు, శిల్ప సంపదకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంత వారసత్వాన్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించడం గర్వకారణమని, ఇందులో పలు ప్రముఖుల కృషి ఉందన్నారు. వరంగల్ వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

ఆద్యంతం ఆకట్టుకున్న పేరిణి శివతాండవం..

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన పేరిణి శివ తాండవం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన పేరిణి శివతాండవం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. గజ్జెల రంజిత్ బృందం ఉత్సాహభరితంగా ప్రదర్శించిన శివుని ఉగ్ర తాండవ రూపాన్ని ప్రతిబింబించే ఈ నృత్యం శౌర్యం, ఉత్సాహం, ఆధ్యాత్మికతను అద్భుతంగా మేళవించింది. ఈ కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, జిల్లా అధికారులు, కళాభిమానులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>