కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్ర విమర్శలు చేశారు. అసలు కేసీఆర్ ఏ విధంగా తెలంగాణకు జాతిపిత అవుతారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే ఆయన జాతిపిత అయితే, ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని కడియం ప్రశ్నించారు. స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) పట్టణంలో గురువారం లబ్ధిదారులకు కడియం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో గత ప్రభుత్వం అనేక అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని కడియం శ్రీహరి ఆరోపించారు. కేసీఆర్ ఎన్నో స్కాములలో ఇరుక్కున్నారని, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. ముఖ్యంగా కూలిపోయే దశలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.
‘తెలంగాణ నీ అయ్య సొత్తా..? నీ అయ్య జాగీరా.. ’ అని మండిపడ్డారు. బిజెపి, బీఆర్ఎస్ రెండు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. వేలకోట్ల రూపాయల ఆస్తులు చెమటోడ్చి సంపాదించారా అని ప్రశ్నించారు. అధికారం పోయినా.. అహంకారం తగ్గలేదని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. కేవలం సెంటిమెంటుతో ప్రజలను మభ్యపెట్టడం ఇక సాగదని, రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన వైనంపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని కడియం శ్రీహరి (Kadiyam Srihari) పేర్కొన్నారు.
Read Also: ఆర్టీసీని ‘మేఘా’కు ధారాదత్తం చేసే కుట్ర : కవిత
Follow Us On: Instagram


