కలం వెబ్ డెస్క్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)పై కాల్పులు జరిగిన ఘటనపై ప్రజా శాంతి అధినేత కేఏ పాల్ (KA Paul) స్పందించారు. వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని హిల్‌టన్ హోటల్‌లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన సమయంలో కేఏ పాల్ కూడా అదే హోటల్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా అదే హోటల్ నుంచి మాట్లాడుతూ కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు. ఆ హోటల్‌కు తరచూ వెళ్తుంటానని పాల్ వెల్లడించారు. హోటల్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్నారు. అలాంటప్పుడు ఆగంతకుడు ఎలా ఎంట్రీ ఇచ్చాడని ప్రశ్నించారు. అమెరికా ప్రెసిడెంట్ హోటల్‌లో ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ జరగాలని కోరారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోయాయని, శాంతి కరువైందని పాల్ అన్నారు. క్రైం రేట్ పెరిగిపోయిందని, పొలిటికల్ అజెండాలు పెరిగిపోయాయని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జరుగుతున్న అన్ని యుద్ధాలు ఆగాలని పాల్ కోరారు. అందరూ శాంతి కోసం తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

