కలం, వెబ్ డెస్క్: దేశ ప్రజలకు ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూత్రమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) స్పష్టం చేశారు. ఎలాంటి కారణంతోనైనా ఓటు హక్కు తొలగిస్తే.. అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 326ని ఉల్లంఘించినట్లే అన్నారు. ఓటు హక్కు కేవలం చట్టబద్ధ హక్కు మాత్రమే కాదని.. అన్నింటికి మించి అది రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ఆర్టికల్ 326 అనేది 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఎన్నికల వ్యవస్థలో కచ్చితంగా పాల్గొనాలని నిర్దేశిస్తోందన్నారు. ఓటు హక్కు పేరిట దేశ ప్రజలను రెండు విభజిస్తామంటే కుదరదన్నారు. అలాంటి పరిణామాన్ని కూడా ఎవరూ ఊహించలేరన్నారు.
ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకం..
దేశంలో ఒక వర్గానికి ఓటు ఉండి, అదే అర్హతలున్న మరో వర్గానికి ఓటు లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) తెలిపారు. లక్షలాది మంది ప్రజలను ఓటు హక్కు నుంచి దూరం చేయడం ద్వారా సొంత దేశంలో వారిని రెండో తరగతి పౌరులుగా పరిగణించడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. అందుకు ఎలాంటి వాదనలు చేసినా సమర్థించే ప్రశ్నే ఉండదన్నారు. ఓటు హక్కు నిరాకరించడం అంతిమంగా రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను దెబ్బతీస్తోందన్నారు. మనం రూపొందించుకున్న రాజ్యాంగ వ్యవస్థను మనమే నిరాకరించినట్లవుతుందని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Also Read : ముఖ్యమంత్రిగా బీసీ నేత.. మహేశ్ గౌడ్ కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

