కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ లోని దివిటీపల్లి (Divitipally) మహబూబ్‌నగర్ నగరంలోనే ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. స్థానిక దివిటీ పల్లి లో యూడీఎఫ్ నిధులు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ కనెక్టివిటీ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివిటీ పల్లితో పాటు సమీపంలోని అంబటిపల్లి రోడ్డు కనెక్టివిటీ కోసం కూడా మరో రూ.50 లక్షల నిధులు కేటాయించి, నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. కార్పొరేషన్లో విలీనం కావడంతో మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు విస్తృతంగా అందుతున్నాయన్నారు. శంకుస్థాపన చేసిన ప్రతి పనినీ పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని యెన్నం పేర్కొన్నారు.
టెక్నాలజీ రంగాల్లో రాణించాలి :
అమరరాజా వంటి ప్రముఖ పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి దక్కేలా చూస్తామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) చెప్పారు. అయితే యువత కేవలం సాధారణ ఉద్యోగాలకే పరిమితం కాకుండా మేనేజర్, ఇంజినీరింగ్ స్థాయి పోస్టులు సాధించేలా సాంకేతిక నైపుణ్యాలను యువత పెంపొందించుకోవాలని సూచించారు. స్కూలు, కళాశాల స్థాయి నుంచే విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ టెక్నాలజీపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు.
ఈ డివిజన్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. హైవే కు అతి సమీపంగా ఉన్న డివిజన్ ప్రమాదాల నివారణకు శాశ్వత ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల ఏర్పాటుపై నేషనల్ హైవే అధికారులతో చర్చించి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, స్థానిక చెరువు అభివృద్ధి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఎన్నికలు ముగిశాక రాజకీయాలు, పార్టీలకు, కులాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ ఆంజనేయులు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సిరిగిరి మురళి, నాయకులు చంద్రశేఖర్, శివప్రసాద్, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read : SLBC టన్నెల్ పనుల్లో షియర్‌జోన్ దాటిన తవ్వకాలు: ఉత్తమ్
Follow Us On: Youtube

