కలం, వెబ్ డెస్క్: బీసీ నాయకుడు తెలంగాణకు కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అందుకు మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. శంషాబాద్‌లో జరుగుతున్న బీసీ కులగణన మహా గర్జన సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బీసీలపై చిత్తశుద్ధి ఉందని.. అందుకే సమగ్రంగా సర్వేను నిర్వహించామన్నారు. బీసీ కులగణనకు అసెంబ్లీలో బీజేపీ మద్దతు ప్రకటించి.. ఢిల్లీలో ఆ నివేదికను తొక్కి పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ గణన తూతూ మంత్రంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణలో బీసీల గురించి ఇంత గట్టిగా మాట్లాడుతున్నామంటే రాహుల్ గాంధీనే కారణమన్నారు. మోదీ మరో రెండున్నరేళ్లు మాత్రమే ప్రధానిగా ఉంటారని.. తరువాత ప్రధాని రాహుల్ గాంధీనే అన్నారు.
మంత్రి వర్గంలో బీసీలకు ప్రాధాన్యం..
రాబోయే రోజుల్లో మంత్రి వర్గంలో బీసీల సంఖ్యను మరింత పెంచుతామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అంతేగాకుండా, కార్పొరేషన్ పదవుల్లోనూ వారికి ఎక్కువ కేటాయిస్తామన్నారు. బీసీలంతా ఏకమైతే ఎదురించే శక్తి ఎవరికీ లేదన్నారు. పోరాడితే పోయేదేం లేదని పిలుపునిచ్చారు. బీసీ సంఘాలు ఏకతాటి మీదకు రావాలని.. కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక దేశ వ్యాప్తంగా ఓబీసీల కులగణన కచ్చితంగా జరిగి తీరుతుందన్నారు.

