కలం, వెబ్ డెస్క్ : జూరాల ప్రాజెక్టు (Jurala Project ) నుంచి సాగు నీరు విడుదల చేయాలని ప్రతిపక్ష పార్టీలు, రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి సమావేశమయ్యారు. అల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అంశంపై కర్ణాటక ప్రభుత్వంతో జరిపే సంప్రదింపులపై ఈ సందర్భంగా సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
దీంతో మహబూబ్ నగర్ జిల్లా తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరేందుకు ప్రజాప్రతినిధుల బృందం నేడు సాయంత్రం బెంగళూరుకు పయనం కానుంది. రేపు కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్‌తో మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రుల బృందం సమావేశమై ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదలపై చర్చలు జరపనున్నారు. ఈ భేటీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే కర్ణాటక ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి ప్రతిపాదిత అంశాలపై ప్రాథమిక చర్చలు జరిపారు. అనంతరం కర్ణాటక సీఎం అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈ క్రమంలో రేపటి నుంచే జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

