కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో పే అండ్ అకౌంట్స్ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. వెంకటేశ్వర రాజు (Joint Director Venkateswara Raju) ఈ నెల పదవీ విరమణ పొందనున్న సందర్భంగా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ భవనంలో ఉద్యోగులు ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు, అలాగే వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు హాజరై వెంకటేశ్వర రాజును మెమెంటోలు, పుష్పగుచ్ఛాలు, గజమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఉద్యోగుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు..
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ (Telangana Employees JAC) చైర్మన్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, కరీంనగర్ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొంకురి శంకర్ హాజరై పదవీ విరమణ పొందుతున్న అధికారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, విధి నిర్వహణలో చేసిన సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో దాదాపు మూడు సంవత్సరాలపాటు జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన వెంకటేశ్వర రాజు ఉద్యోగుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
ఆయన నిష్పక్షపాత వైఖరి ఆదర్శప్రాయం..
కరీంనగర్ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల ఎం. వెంకటేశ్వర రాజు చూపిన ఆప్యాయత, అందరికీ అందుబాటులో ఉండే తీరు, పరిపాలనలో నిష్పక్షపాత వైఖరి ఆదర్శప్రాయమని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆయన అందించిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీవో నాయకులు వెంకటేశ్వర రాజును గజమాలతో, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్ గౌడ్, టీఎన్జీవో నాయకులు ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ మహేందర్ సింగ్, రాగి శ్రీనివాస్, హరికృష్ణ, ఒంటెల రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగారపు రమేష్, పోలు కిషన్, హస్గర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోట రామస్వామి, సుధాకర్ రెడ్డి, శ్రీమాన్ రెడ్డి, రమేష్ తదితర వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

