కేంద్ర విధానాలతో తీవ్ర సంక్షోభంలోకి పోతున్న దేశం: ఏఐటీయూసీ

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాల వల్ల దేశం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని ఏఐటీయూసీ (AITUC) జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జీత్ కౌర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక పద్మనాయక కళ్యాణ మండపం ‘అమరజీవి మాదన నారాయణ స్మారక ప్రాంగణం’లో ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమర్ జీత్ కౌర్ (Amarjeet Kaur).. ఏఐటీయూసీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం అమరవీరుల స్మారక స్తూపాన్ని మహాసభల చీఫ్ ప్యాట్రన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యూసుఫ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల
శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు.

స్వాతంత్య్ర స్ఫూర్తికి భిన్నంగా మోదీ పాలన..

ఈ సందర్భంగా అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశంలో నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం తీవ్రమయ్యాయని విమర్శించారు. లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ఉన్నత విద్యకు నిధులు కోత విధిస్తూ కార్పొరేట్లకు, విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉచిత భూములు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. జాతీయ ఆస్తులను అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తూ, ట్రేడ్ యూనియన్లను అణచివేసేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం..

మహాసభల చీఫ్ ప్యాట్రన్ చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు  106 సంవత్సరాల పోరాట చరిత్ర కలిగిన ఏఐటీయూసీ, భవిష్యత్తులోనూ కార్మిక వర్గానికి కల్పతరువుగా నిలవాలని ఆకాంక్షించారు.

కార్మిక ఉద్యమాలకు ఈ మహాసభ దిక్సూచి..

కరీంనగర్ జిల్లా కార్మిక పోరాటాల చరిత్రను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఏఐటీయూసీ నిర్మించబోయే కార్మిక ఉద్యమాలకు ఈ మహాసభ దిక్సూచిగా నిలుస్తుందని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. 33 జిల్లాల నుండి విచ్చేసిన ప్రతినిధులు పోరాటాలకు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు.

ఈ సభలో ప్రపంచ కార్మిక సంఘాల ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సి. శ్రీకుమార్, ఏఐటీయూసీ ఏపీ కార్యదర్శి వెంకట సుబ్బయ్య, వామపక్ష కార్మిక సంఘాల (CITU, HMS, TUCI) రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, ఉపేందర్, సూర్యం సౌహార్ద సందేశాలు ఇచ్చారు. రైతులు, విద్యార్థుల పోరాటాల తరహాలోనే కార్మికులందరూ ఏకమై లేబర్ కోడ్‌లను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కలవేన శంకర్, వి.ఎస్. బోస్, వాసిరెడ్డి సీతారామయ్య, ఎం. నర్సింహా, కె. యేసురత్నం, బి. చంద్రయ్య, పి. ప్రేమ్ పావని, ఎన్. కరుణ కుమారి, ఎస్. విలాస్, నర్సింహ రావు, బి. వెంకటేష్, పల్లా దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>