జింకలగూడెం వీడియో కలకలం వెనుక అసలు నిజం ఇదే!

​కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం (Jinkalagudem) గ్రామంలో ‘దెయ్యం పట్టింది’ అనే కారణంతో వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి కొట్టారు అనే వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో నాలుగు రోజుల క్రితం బయటకు రావడంతో గ్రామంలో మూఢనమ్మకాలపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే, ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేశారని బాధితురాలు సకినబీ స్పష్టం చేశారు.

​శుక్రవారం బూర్గంపాడు సిపిఎం బృందం జింకలగూడెం గ్రామానికి వెళ్లి బాధితురాలు సకినబీని నేరుగా కలిసి మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “గత రెండు నెలలుగా నాకు జ్వరం వచ్చి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కోలుకోవాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేశారు తప్ప నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. ఎవరూ కొట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. కేవలం కొందరు కావాలనే దీనిపై దుష్ప్రచారం చేశారు” అని వివరించారు.

​ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మానవుడు సైన్స్ అండ్ టెక్నాలజీతో చంద్రమండలానికి వెళ్లి విజయవంతంగా తిరిగొస్తున్న ఈ ఆధునిక కాలంలో, గ్రామాల్లో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు పుట్టుకురావడం విచారకరమన్నారు. ఇంద్రలోకం, చంద్రలోకం లేదా దెయ్యాలు అనేవి లేవని సైన్స్ స్పష్టంగా చెబుతోందని గుర్తుచేశారు.

​గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై ఉందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కేవలం కేసులు నమోదు చేయడం సరికాదని, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు కౌన్సెలింగ్, అవగాహన సదస్సులు నిర్వహించి జ్ఞానోదయం కలిగించాలని డిమాండ్ చేశారు. ​ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎస్.కె. అబీదా, గుంటా కృష్ణ, ఎస్.కె. హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>