కలం, జగిత్యాల: కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా.. రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి బాధితురాలిదేనని నిర్ధారించినా.. కబ్జా ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని ఆమె అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని ప్రజావాణిని ఆశ్రయించింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ముగ్గిడి గ్రామంలో చోటుచేసుకున్న భూవివాదం (Maggidi Land Dispute) స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
బాధితురాలి కథనం ప్రకారం.. ధర్మపురి మండలం మగ్గిడి గ్రామానికి చెందిన ముంజం శ్రీమతి (భర్త మల్లేశం)కు అదే గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 339/6లో రెండు ఎకరాల పట్టా భూమి ఉంది. ఆ భూమే తమ కుటుంబానికి ప్రధాన జీవనాధారం. గత కొన్నేళ్లుగా అందులో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
అయితే, అదే గ్రామానికి చెందిన జక్కి రాజు అనే వ్యక్తి తన భూమిలోని ఎకరం భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నాడని శ్రీమతి ఆరోపిస్తోంది. గతంలో తన భూమిలో బావి తవ్వేందుకు ప్రయత్నించగా, ఈ విషయాన్ని ధర్మపురి సీఐ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పనులను నిలిపివేయించినట్లు బాధితురాలు తెలిపింది.
తన భూమిని కాపాడుకునేందుకు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ పొందింది. అయినప్పటికీ, సదరు వ్యక్తి కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. గత వారం రోజులుగా మళ్లీ తన భూమిలో ట్రాక్టర్‌తో దున్నుతున్నాడని, ఇదేమిటని ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, ధర్మపురి ఎస్సై స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపినట్లు బాధితురాలు పేర్కొంది.
భూ వివాదంపై ధర్మపురి తహశీల్దార్ సైతం స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి, సదరు భూమి తనదేనని నిర్ధారించినట్లు శ్రీమతి వెల్లడించింది. రెవెన్యూ, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపినా, తన భూమిలో జరుగుతున్న ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయింది.
స్థానికంగా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో బాధితురాలు హైదరాబాద్‌లోని బేగంపేట మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో నిర్వహించే సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. మంగళవారం ప్రజావాణిలో ఆమె ఇచ్చిన ఫిర్యాదును అధికారులు స్వీకరించి, తగిన చర్యల నిమిత్తం ధర్మపురి స్టేషన్ హౌస్ అధికారికి పంపించారు. ఫిర్యాదుపై “Please examine and take necessary action as per Act” అని సూచించినట్లు బాధితురాలు తెలిపింది.
కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి అధికారులు విచారణ జరిపినప్పటికీ తన భూమికి రక్షణ లేకుండా పోయిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే స్పందించాలని, కబ్జా చేసిన జక్కి రాజుపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని, బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

