మహబూబ్‌నగర్‌లో విద్య, సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యం: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో విద్యా రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్య, మౌలిక వసతులు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై సమగ్ర దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు.

మహబూబ్‌నగర్ పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి 6.86 కోట్ల రూపాయలతో భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని అలాగే, ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో శిథిలావస్థకు చేరిన భవనాల కారణంగా ప్రస్తుతం ఒకే భవనంలో తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. పాత భవనాల స్థానంలో ఆధునిక వసతులతో కొత్త భవనాలను నిర్మించి కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంవీఎస్ జూనియర్ కళాశాలను భవిష్యత్తులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలో కేజీ నుంచి 12వ తరగతి వరకు విద్య అందించే సమగ్ర విద్యాసంస్థగా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు.

సుమారు రూ.7.95 కోట్లతో భవన నిర్మాణం పూర్తయిన అనంతరం హైస్కూల్‌ను కూడా అక్కడికి తరలించి, పాఠశాల–జూనియర్ కళాశాలకు ఒకే ప్రాంగణంలో సమగ్ర విద్యా విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవిఎస్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. కొత్త బ్లాక్ నిర్మాణంతో పాటు కళాశాల సమగ్ర అభివృద్ధికి సుమారు రూ.70 కోట్ల అంచనాతో దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కళాశాల 60వ వార్షికోత్సవాన్ని ఈ విద్యా సంవత్సరంలో ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపారు. గత ఆరు దశాబ్దాల్లో కళాశాలలో చదివి పట్టాలు పొందిన పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసి భారీ స్థాయిలో వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని ఆహ్వానించి ఘనంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

విద్యార్థుల వసతి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే రెండు హాస్టల్ బ్లాకుల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. ఎస్సీ బాలురు, బాలికల కోసం కూడా హాస్టళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను విద్యార్థుల వసతి అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పాలమూరు యూనివర్సిటీ లో అత్యంత వేగంగా ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల భవనాలు నిర్మాణం జరుపుకుంటున్నాయని అన్నారు. తాను ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో రెండు హాస్టల్ భవనాలను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జిల్లా క్రీడా మైదానం వెనుక భాగంలో బాలికల హాస్టల్ నిర్మాణానికి స్థల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ స్టేడియం అభివృద్ధికి అవసరమైన స్థలం, మౌలిక వసతులపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు.

మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు భవిష్యత్తులో రెండు మైనారిటీ విద్యాసంస్థలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరన్న పేటలో రెండు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయని, ఇప్పటికే పలు దేశాల్లో డ్రైవర్‌లెస్ రవాణా వ్యవస్థలు, ఆటోమేటెడ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో డ్రైవర్‌లెస్ ట్యాక్సీల వంటి సాంకేతికతలు వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో మనం కూడా భవిష్యత్ సవాళ్లకు ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పుల ప్రాధాన్యతను తెలంగాణ ప్రభుత్వం ముందుగానే గుర్తించి స్కిల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

ఐటీఐలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నామని వెల్లడించారు. టాటా టెక్నాలజీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సాంకేతిక శిక్షణా కార్యక్రమాల ద్వారా కూడా యువతకు ఆధునిక నైపుణ్యాలను అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్థులకు మెరుగైన ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం భవనాలు నిర్మించడం మాత్రమే కాకుండా, ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందించేలా విద్యాసంస్థలను తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంచార్జీ సిజె బెనహర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, సుధాకర్ రెడ్డి, మోయీజ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>