పెన్షన్లను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్: జీవన్ రెడ్డి

కలం, జగిత్యాల: వృద్ధులు, బీడీ కార్మికుల పెన్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, వీరికి కూడా దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy) డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి మాజీ ఛైర్​ పర్సన్​ దావా వసంత సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు ఆసరా కోసం కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ను 2000కు పెంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2000 నుండి 4000కు పెంచుతామని, ఆడబిడ్డలకు 2500 ఇస్తామని హామీ ఇచ్చి 32 నెలలు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు.

ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్న 7 రకాల పెన్షన్లలో వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్ ను చేర్చలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ బీడీ కార్మికులకు 2000 పెన్షన్ ఇచ్చారని, ఉత్తర తెలంగాణలో లక్షలాది ఆడబిడ్డలకు ఉపాధినిస్తున్న బీడీ పరిశ్రమను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వృద్ధుల సంరక్షణ కోసం చట్టం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, పెన్షన్ల పంపిణీపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. వృద్ధాప్య పెన్షన్, బీడీ కార్మికుల పెన్షన్, ఆడబిడ్డలకు 2500 పెన్షన్ ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కళ్యాణ లక్ష్మిని నిలిపివేయడం సిగ్గుచేటు: దావ వసంత సురేష్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కేసీఆర్ కుల మతాలకు అతీతంగా 50 వేల నుండి లక్ష రూపాయలకు పెంచి అమలు చేశారని జడ్పీ మాజీ ఛైర్పర్సన్ వసంత సురేష్ తెలిపారు. అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పథకాన్నే నిలిపివేసిందని మండిపడ్డారు. దశాబ్ద కాలంగా అమలవుతున్న పథకంపై ప్రభుత్వం కోర్టులో కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని, ఉద్దేశపూర్వకంగా సంక్షేమ పథకాలపై భారం తగ్గించే కుట్రలో భాగంగానే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

కళ్యాణ లక్ష్మితో కేసీఆర్ ను ప్రతి ఇంటి మేనమామగా ప్రజలు భావించారని, ఆ పథకాన్ని వెంటనే పునరుద్ధరించి ప్రభుత్వం చెంపలు వేసుకోవాలని వసంత డిమాండ్ చేశారు. మహిళల ఉసురు పోసుకోవడం మానుకోవాలని, నైతికత ఉంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో శీలం ప్రవీణ్ కుమార్, వోల్లెం మల్లేశం, గాజుల రాజేందర్, మున్నా, కళ్లేపల్లె దుర్గయ్య, కోరుకంటి రాము, తోట హరీష్, సతీష్ కుమార్, పల్లె రవి, రాధా కిషన్, గంగా రెడ్డి, పొనగంటి మహేష్, రమేష్ బాబు, బర్కం మల్లేశం, నరేష్ గౌడ్, కచ్చు హరీష్, సాయి, మహేష్, గుండా మధు, మధు, అనిల్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>