టెస్టులే ముందు.. యువ క్రికెటర్లకు శ్రీనాథ్ వార్నింగ్

కలం, స్పోర్ట్స్‌: ఐపీఎల్‌ మెరుపుల కంటే టెస్టు క్రికెట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ భారత పేసర్‌ జవగల్‌ శ్రీనాథ్‌ (Javagal Srinath) యువ క్రికెటర్లకు సూచించారు. సుదీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగాలంటే టెస్టులపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇండోర్‌లోని బ్రిలియంట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సీజన్‌ అవార్డ్స్‌ 2025-26 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టెస్టు క్రికెట్‌ ఆటగాడికి పూర్తి స్థాయి నైపుణ్యాలను అందిస్తుందని శ్రీనాథ్‌ పేర్కొన్నారు. ఐదు రోజుల ఆటే క్రికెట్‌కు పునాది అని అన్నారు. టెస్టులు ఆడే ఆటగాడికి టీ20 ఫార్మాట్‌లోకి మారడం సులభమని, అయితే కేవలం టీ20లు ఆడిన ఆటగాడికి టెస్టుల్లో రాణించడం అంత సులభం కాదని వివరించారు.

ఐపీఎల్‌ కూడా ముఖ్యమేనని శ్రీనాథ్‌ అంగీకరించారు. అయితే డబ్బు, గ్లామర్‌కు ఆకర్షితులై టీ20 క్రికెట్‌నే కెరీర్‌ లక్ష్యంగా మార్చుకోవద్దని సూచించారు. సుదీర్ఘ కెరీర్‌ కోరుకునే యువ ఆటగాళ్లు టెస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, 15 ఏళ్ల పాటు క్రికెట్‌ను వృత్తిగా కొనసాగించాలంటే టెస్టులు ఆడటం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. యువ ఆటగాళ్ల కెరీర్‌ విషయంలో తల్లిదండ్రులు, రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు, కోచ్‌లు సరైన మార్గనిర్దేశం చేయాలని శ్రీనాథ్‌ కోరారు. టెస్టు, టీ20 ఫార్మాట్లు రెండింటినీ కొనసాగించవచ్చని, అయితే కెరీర్‌కు బలమైన పునాది కోసం టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్‌ తరఫున శ్రీనాథ్‌ 67 టెస్టుల్లో 236 వికెట్లు, 229 వన్డేల్లో 315 వికెట్లు సాధించారు. తన సుదీర్ఘ క్రికెట్‌ అనుభవం ఆధారంగానే యువ ఆటగాళ్లకు టెస్టుల ప్రాధాన్యాన్ని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>