కలం, వెబ్ డెస్క్: సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ (CM Revanth) సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో బుధవారం సీఎం సమావేశమై చర్చించారు. సీఎస్ఆర్‌కు కంపెనీలు చేస్తున్న వ్యయం 100% సత్ఫాలితాన్ని ఇచేలా ఉండాలని చెప్పారు. విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. కంపెనీలు వీటితో పాటు తమకు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాలన్నారు. తెలంగాణ విద్యార్థులను ప్రభుత్వంతో పాటు కంపెనీలు కలిపి చేసే వ్యయంతో ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్ది భవిష్యత్ అవకాశాలను వారు అందిపుచ్చుకునేలా తయారు చేయగలమని చెప్పారు.
రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైదరాబాద్‌లోనే 44 శాతం ఉన్నారని.. వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి వరకు సరైన విధానం లేకపోవడంతో.. దీని కోసమే తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించామని చెప్పారు. కంపెనీల ప్రతినిధులు ఆ అధికారితో సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న విద్య, వైద్యం, జల వనరులు, నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించవచ్చని సూచించారు. ఇప్పటికే రహేజా గ్రూప్ రూ.50 కోట్లు, రాంకీ గ్రూప్ రూ.50 కోట్లు, యశోద ఫౌండేషన్ రూ.10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.

