కలం, జనగామ : జిల్లా కేంద్రం జనగామ (Jangaon)లో ప్రజా సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సాధారణ, ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారంలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 30 వార్డుల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, వీధి కుక్కలు, కోతుల బెడద వంటి సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
వర్షాలు కురిస్తే ఆగం..?
వర్షాకాలం సమీపిస్తుండటంతో ఆందోళన మరింత పెరిగింది. ప్రతి ఏడాది వర్షాల సమయంలో వీవర్స్ కాలనీ, జయశంకర్ నగర్, వ్యవసాయ మార్కెట్ ప్రాంతం, మరిగడి రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, మురుగు నీరు కాలనీల్లోకి చేరడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది కూడా నాలాల పూడికతీత, డ్రైనేజీల శుభ్రత, వర్షపు నీటి పారుదల మార్గాల అభివృద్ధి వంటి పనులు పూర్తి స్థాయిలో చేపట్టలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక పట్టణంలోని అనేక రోడ్లు గుంతలమయంగా మారగా, వర్షాలు కురిస్తే ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా స్పందన ఆలస్యమవుతోందని చెబుతున్నారు.
రాజకీయాలపైనే దృష్టి..
మరోవైపు మున్సిపల్ పాలకవర్గంలో రాజకీయ విభేదాలు, అంతర్గత పోరు కారణంగా ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలానికి ముందే అన్ని వార్డుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి నాలాల పూడికతీత, డ్రైనేజీల శుభ్రత, రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ కార్యక్రమాలు చేపట్టాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

