కలం, వెబ్‌డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లాలో వీధి కుక్కల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, వీధి కుక్కలను అక్రమంగా తరలిస్తున్నారని (Stray Dog Relocation) పలు జంతు సంరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. తాజాగా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని చెప్పియాల్ గ్రామం నుంచి సుమారు 50 కుక్కలను పట్టుకొని సమీపంలో అడవిలో వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఆదులాపురం గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్ దివ్య దేవరాజన్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఇలా జంతువులను అక్రమంగా తరలించడం చట్ట విరుద్ధమని జంతు సంరక్షణ సంస్థలు, జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కుక్కలను పట్టిన తీరుపైనా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి అక్రమ రవాణాను ఆపేయాలని వారు కోరుతున్నారు. ఇలా వాటిని అడవికి తరలించడం వల్ల తిండి దొరక్క వాటి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని అంటున్నారు. జగిత్యాలలో పలుచోట్ల ఇటీవల వీధి కుక్కల బెడద పెరిగిపోయింది. దీంతో పలు గ్రామాల నుంచి వాటిని అడవుల్లోకి తరలిస్తున్నారు. అయితే వాటిని అలా తరలించకూడదని, సెర్టిలైజేషన్, వాక్సినేషన్ చేయాలని జంతు సంరక్షణ సంస్థలు కోరుతున్నాయి.

