కలం, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ (Thimmapur) గ్రామ శివారులో చోటుచేసుకున్న వృద్ధురాలి మృతి కేసును కేవలం నాలుగు గంటలలో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలక ఆధారాలు అందించిన గ్రామస్థులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దోమల రవి, దోమల గంగాధర్‌లు పోలీసులకు అందించిన బైక్‌కు సంబంధించిన ఫొటో ఆధారాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారాయి. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిని ప్రత్యేకంగా అభినందించిన ఎస్పీ.. బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్(Jagtial Sp Ashok Kumar) మాట్లాడుతూ నేరాల ఛేదనలో పోలీసులకు ప్రజల సహకారం ఎంతో కీలకమని అన్నారు. గ్రామాల్లో లేదా పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద ఘటనలు కనిపించినా, నేరానికి సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు సకాలంలో అందించే సమాచారం నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తులోనూ కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. తిమ్మాపూర్ కేసులో రవి, గంగాధర్ అందించిన బైక్ ఫొటోలు దర్యాప్తులో ముఖ్య ఆధారాలుగా మారాయని పేర్కొన్నారు.
పోలీసులతో ప్రజలు సమన్వయంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు. నేరం జరిగినప్పుడు లేదా నేరానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ ఉమాసాగర్తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

