కలం, వెబ్‌డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy) లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. తొలుత బ్యాటింగ్‌లో వైభవ్ తీవ్రంగా నిరాశపరిచాడు. 6 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయినప్పటికీ సుదీప్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఈస్ట్ జోన్ మొదటి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఈస్ట్ జోన్ ప్రత్యర్థికి ఫాలోఆన్ విధించింది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా నార్త్ ఈస్ట్ జోన్ కోలుకోలేకపోయింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌లో అద్భుతం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. టాప్ స్కోరర్ కిషన్ లింగ్డో (25), ఇమ్లివాతి లెమ్తుర్ (4)లను పెవిలియన్‌కు పంపాడు.
బిసిసిఐ కూడా వైభవ్ బౌలింగ్ విన్యాసాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో వైభవ్ జెర్సీ నంబరు అందరి దృష్టిని ఆకర్షించింది. అతని జెర్సీపై ‘3’ అనే అంకె మాత్రమే కనిపించేలా టేప్ వేశారు. ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ 3వ నంబర్ జెర్సీనే ధరిస్తాడు. ప్రింటింగ్ పొరపాటును కవర్ చేయడం కోసమే ఇలా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, బౌలింగ్‌లో ప్రతిభ చాటి వైభవ్ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

