కలం, వెబ్ డెస్క్: ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అన్యాయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడం పక్కా ప్రణాళికతో బీజేపీ చేసిన రాజకీయ కుట్ర అని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్‌పై బీజేపీవి లో లెవల్ పాలిటిక్స్ అని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను ముందుపెట్టి నామినేషన్ రిజెక్ట్ చేయించిందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ నిజాయితీగల, అంకితభావం ఉన్న మహిళా నేత అని కొనియాడారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదని.. కోర్టుల్లో ఎటువంటి న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో లేవు అని చెప్పారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ధర్నాలు, రాస్తారోకోలు లేదా రాజకీయ వివాదాల్లో పాల్గొన్న దాఖలాలు లేవని అన్నారు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు బహిరంగ జీవితంలోనూ ఆమెది మచ్చలేని చరిత్ర అని స్పష్టం చేశారు. ఇంతటి క్లీన్ రికార్డ్ ఉన్న నాయకురాలి నామినేషన్‌ను తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని, ఇది అన్యాయమైన, పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఈ మేరకు నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడారు.

