Mobile Popup Ad
Mobile Popup Ad

ఉప్పల్ స్కైవాక్ లిఫ్టులో చిక్కుకున్న యువకుడు : అర్ధరాత్రి నరకం!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్కైవాక్‌ (Uppal Skywalk)లో తీవ్ర కలకలం రేగింది. గురువారం అర్ధరాత్రి వేళ ఇక్కడి లిఫ్టులో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక యువకుడు సుమారు రెండు గంటల పాటు లోపలే బంధీ అయ్యాడు. స్థానిక హాస్టల్‌లో నివాసముంటున్న 20 ఏళ్ల రాహుల్ అనే యువకుడు రాత్రి 11 గంటల సమయంలో స్కైవాక్ లిఫ్ట్ ఎక్కాడు. అయితే సాంకేతిక సమస్య కారణంగా లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోవడంతో అతడు బయటకు రాలేకపోయాడు.

బాధితుడు రాహుల్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో, మూసి ఉన్న లిఫ్ట్ గదిలో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఘటన జరిగిన వెంటనే సిబ్బంది స్పందించకపోవడం, టెక్నీషియన్లు రావడం ఆలస్యం కావడంతో రక్షణ చర్యలు నత్తనడకన సాగాయి. చివరకు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, లిఫ్ట్ డోర్లు పగలగొట్టి అర్ధరాత్రి 1:15 గంటల సమయంలో రాహుల్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

రెండు గంటల పాటు మృత్యువుతో పోరాడినంత పని కావడంతో బయటకు వచ్చిన రాహుల్ భయంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను హార్ట్ పేషెంట్‌నని, సకాలంలో స్పందన కరువవడంతో ఊపిరాడక నరకం చూశానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఉప్పల్ స్కైవాక్‌లో కనీస నిర్వహణ లోపించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>