కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ, చంద్రబాబుల క్రాస్ బ్రీడే రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోడీ వెనక ఉన్నారనే ధీమాతోనే రేవంత్ జాతీయ బ్యాంకు ఎస్‌బీఐ (SBI)ను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పే మాయ మాటలు అంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకపోవడమేనా? అని ఎద్దేవా చేశారు.
మాయపు, మోసపు, దుర్మార్గ మాటలు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకించి హైబ్రిడ్ కాంగ్రెస్ కు అలవాటు అంటూ విమర్శించారు. ఒక జాతీయ బ్యాంకును కూడా బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం ఈ ముఖ్యమంత్రికే చెల్లిందంటూ దుయ్యబట్టారు. జనసేన కార్యాలయం పేరిట ఒక డ్రామా పెట్టారని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు రావద్దని ఎవరు అన్నారు? కొత్తగా ఆఫీస్ పెట్టేదేమి ఉంది? అన్ని రాష్ట్రాల్లో జన సేన కార్యాలయం పెట్టినా అభ్యంతరం లేదు అంటూ విమర్శలు గుప్పించారు.
యాసంగి భరోసా మొత్తం అయిపోయిందా?
వర్షాకాలం సమీపించినా ఇంకా మిగిలిన వడ్ల కొనుగోళ్లపై జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని చెప్పారు.రాష్ట్రంలో మిగిలిన వడ్లు మొత్తం కొనుగోళ్లు చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రైతుభరోసా (Rythu Bharosa) కింద ఇచ్చిన నిధుల కంటే… ఆ పేరుతో పెట్టిన సభలకే ఎక్కువ ఖర్చు అయిందని ఎద్దేవా చేశారు.
రేవంత్ సర్కార్ పై ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వానకాలం భరోసా ఇస్తామంటున్నారు.. యాసంగి భరోసా మొత్తం అయిపోయిందా? అని ప్రశ్నించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.30 వేల కోట్ల బకాయి ఉందని.. మొత్తం బకాయిలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ లో ఎన్నికలు పెట్టే ఉద్దేశంతో రైతుల్ని మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read Also: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
Follow Us On: Instagram

