‘అంగన్‌వాడీ’లోనూ రెండు జీతాలు

కలం, తెలంగాణ బ్యూరో: మహిళా శిశు సంక్షేమ శాఖలోనూ ఒకే ఆధార్ నెంబర్‌తో వేర్వేరు చోట్ల పని చేస్తున్న ఉద్యోగులు రెండు జీతాలు అందుకుంటున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. మొత్తం 129 మంది అంగన్‌వాడీ (Anganwadi) టీచర్లు, హెల్పర్లు వేర్వేరు చోట్ల రికార్డుల్లో నమోదైనట్లు తేలింది. దీంతో వారి రికార్డుల్ని సరిచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆర్థిక శాఖ ఆదేశించింది. అప్పటి వరకు వారికి జులై జీతాలు (గౌరవ వేతనం) ఇవ్వొద్దని నిర్ణయించింది. ఒకే ఆధార్ నెంబర్‌తో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించడంతో పాటు ఒకే ఉద్యోగి పేరు వేర్వేరు చోట్ల రికార్డుల్లో నమోదైనట్లు తేలింది. ఆయా జిల్లాల సంక్షేమ శాఖ అధికారులు సంబంధిత ఉద్యోగుల సరైన ఆధార్ నెంబర్‌ను, ప్రస్తుతం పని చేస్తున్న ప్రదేశం వివరాలను ‘గూగుల్ షీట్స్’లో నమోదు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. కాగా, పలు ప్రభుత్వ శాఖల్లో ఒకే ఆధార్‌‌తో రెండు వేర్వేరు చోట్ల రెండు జీతాలు అందుకున్న 40 మంది ఉద్యోగులను ఆర్థిక శాఖ ఇప్పటికే గుర్తించింది.

ఒకచోట టీచర్‌.. మరోచోట కుక్‌

అంగన్‌వాడీ సిబ్బంది (Anganwadi Workers) వివరాలు రికార్డుల్లో తప్పుగా నమోదైన అంశాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక ఉదాహరణతో ప్రస్తావించింది. ఒక ఉద్యోగి అంగన్‌వాడీ టీచర్‌గా ఒకచోట, మరోచోట మండల విద్యాధికారి కార్యాలయంలో కుక్-కమ్-హెల్పర్‌‌గా నమోదై ఉన్నట్లు పేర్నొన్నది. ఈ ఉద్యోగి ఆధార్‌ నెంబర్ రెండు చోట్ల రికార్డయినట్లు ఉదహరించింది. ఈ కారణంగానే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్‌)లో జీతం ప్రాసెస్‌ కావడం లేదని వివరించింది. సదరు ఉద్యోగి ప్రస్తుతం అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నట్లయితే మండల విద్యాధికారి కార్యాలయంలో డ్రాయింగ్ ఆఫీసర్ ‘లాగిన్‌’లో ఉన్న పాత/డూప్లికేట్‌ ఎంట్రీని తొలగించాలని ఆదేశించింది. ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ విభాగాలు, కార్యాలయాల్లో నమోదై ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించామని పేర్కొన్నది. కాగా, రికార్డులను సరిచేసిన తర్వాతే 129 మంది అంగన్‌వాడీ సిబ్బందికి జులై జీతాలు విడుదల కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>