కలం, ఖమ్మం బ్యూరో: “మా డ్యూటీ.. మా ఇష్టం.. మేమింతే..” అన్నట్లుగా ఉంది భద్రాచలం ఆయుష్ ఆసుపత్రి (Bhadrachalam Ayush Hospital) డాక్టర్లు, ఇతర సిబ్బంది వ్యవహార శైలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన ఆసుపత్రి సిబ్బంది 10 గంటలైనా ఆస్పత్రికి రావడం లేదదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలస్యంగా రావడమే కాకుండా సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సి ఉన్నా టైం అవ్వకముందే వెళ్లిపోతున్నారు. ఇలా ఉదయం 10 తర్వాత నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే విధులు నిర్వహిస్తుండటంతో, భద్రాచలంతో పాటు చుట్టు పక్కల నివసించే ఏజెన్సీ ప్రజలు ఇలాంటి హాస్పిటల్ ఒకటి ఉందనే విషయమే మరిచిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇంగ్లీష్ మందులు కాకుండా, వారి జీవన విధానానికి సరిపోయే సహజ సిద్ధంగా దొరికే ఆకులు, వేర్లు, పొడుల ద్వారా చికిత్స అందించాలనే సదుద్దేశంతో భద్రాచలంలో ఆయుష్ ఆసుపత్రిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఈ ఆయుష్ ఆసుపత్రుల్లో హోమియోపతి వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో యోగా సెంటర్ కూడా ప్రారంభించారు. అయితే ఈ విభాగాలకు సంబంధించిన సిబ్బంది ఎవ్వరూ సమయపాలన పాటించకపోవడంతో విమర్శల పాలవుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఆదివాసీలు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సులువుగా ఉండటం కోసం ఆయుష్ హాస్పిటల్‌ను ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఏర్పాటు చేశారు. కానీ, ప్రచారం కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారన్నది చూసిన వారెవరికైనా సులభంగా అర్థమవుతుంది.
దీర్ఘకాలిక వ్యాధులు కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, పక్షవాతం, చర్మ వ్యాధులకు, చిన్న పిల్లల్లో తరచూ వచ్చే జలుబు, దగ్గు, అలర్జీలు, రోగని రోధక శక్తి పెంచడానికి, జన్యుపరమైన సమస్యలు సోరియాసిస్, ఆస్తమా వంటి మొండి వ్యాధులకు మాత్రమే కాకుండా బీపీ షుగర్, స్థూలకాయం తగ్గించడానికి కూడా ఆయుష్ ఆసుపత్రులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఈ వ్యాధులతో భద్రాచలం హాస్పిటల్‌కు వచ్చే వారు కూడా అల్లోపతి వైద్యుల దగ్గరికే వెళ్తున్నారు కానీ పక్కనే ఉన్న ఆయుష్ వైద్యుల దగ్గరికి రావడం లేదు. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ గురించి చాలామందికి అవగాహన లేకపోవడం ఒక కారణమైతే సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం మరొక కారణమని అక్కడి వారు చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రభుత్వ వైద్యశాలల పటిష్టత కోసం బాగానే కృషి చేస్తున్నా.. ఆయుష్ హాస్పిటల్స్‌ను అంతగా పట్టించుకోవడం లేదని, అందుకే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు స్పందించి ఏజెన్సీలోని ఆయుష్ ఆసుపత్రుల పనితీరు, నిర్వహణ, ప్రచారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

