భారత్‌పై సిరీస్ గెలిపించిన కోచ్ రాజీనామా.. ఐర్లాండ్‌లో సంచలనం

కలం, వెబ్ డెస్క్ : భారత్‌పై తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం సాధించిన ఆనందం ఇంకా తగ్గకముందే ఐర్లాండ్ (Ireland) క్రికెట్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జట్టుకు ఈ చారిత్రక విజయాన్ని అందించిన ప్రధాన కోచ్ హెన్రిచ్ మలాన్ (Heinrich Malan) తన పదవికి వెంటనే అమల్లోకి వచ్చేలా రాజీనామా చేశారు. సిరీస్ ముగిసిన 24 గంటలు కూడా గడవక ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 2–0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచిన ఐర్లాండ్, రెండో మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 9 వికెట్లకు 153 పరుగులకే పరిమితమైంది. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ కొట్టిన సిక్సర్ కూడా జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.

ఈ విజయంతో భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా ఐర్లాండ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. సిరీస్ అనంతరం హెన్రిచ్ మలాన్ (Heinrich Malan) తన కోచింగ్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ జట్టుకు వీడ్కోలు పలికారు. ఐర్లాండ్ ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో కలిసి పనిచేయడం తనకు గొప్ప అనుభవమని తెలిపారు. తన హయాంలో సాధించిన మైలురాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. ఇంగ్లాండ్‌పై టీ20 ప్రపంచకప్ విజయం, అఫ్గానిస్థాన్‌పై తొలి టెస్టు విజయం, జింబాబ్వేపై స్వదేశీ టెస్టు విజయం, అలాగే పాకిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లపై విజయాలు తన కెరీర్‌లో ప్రత్యేకమైనవని చెప్పారు.

అలాగే వరుసగా టీ20 ప్రపంచకప్‌లకు అర్హత సాధించడం ఐర్లాండ్ క్రికెట్ అభివృద్ధికి పెద్ద విజయమని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన 45 ఏళ్ల మలాన్ 2022 జనవరిలో ఐర్లాండ్ పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2024లో ఆయన ఒప్పందాన్ని పొడిగించారు. అయితే 2027 వరకు ఉన్న ఒప్పందం ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ అర్హత పోరుకు కొత్త కోచ్ జట్టును సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని భావించి ముందుగానే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ ఐర్లాండ్ వెల్లడించింది.

ఇక మలాన్ స్థానంలో గ్యారీ విల్సన్‌ను కొత్త ప్రధాన కోచ్‌గా నియమించారు. 40 ఏళ్ల విల్సన్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఐర్లాండ్ తరఫున 292 మ్యాచ్‌లు ఆడారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన ఇప్పుడు కోచ్‌గా జట్టును ముందుకు నడిపించనున్నారు. తదుపరి ఐర్లాండ్ జట్టు ఆగష్టులో  అఫ్గానిస్థాన్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.

Read Also: ఫోన్‌లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా? అయితే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>