కలం, డెస్క్ : గల్ఫ్ దేశాలపై ఇరాన్ (Iran) దాడులు మరింత పెంచుతోంది. తాజాగా ఒమన్ తీరానికి సమీపంలోని ఓ చమురు ట్యాంకర్ మీద ఆదివారం ఇరాన్ దాడి చేసింది. ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉండగా.. అందులో 15 మంది భారతీయులే ఉన్నారు. ఇందులో నలుగురు భారతీయులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే నౌకలో ఉన్న సిబ్బందిని ఒమన్ అధికారులు సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ విషయాన్ని ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం ఎక్స్ వేదికగా తెలిపింది.
నౌక మీద ఏ ఆయుధంతో దాడి చేశారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు దాడి జరిగిన నౌక మీద గతంలో అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ చమురు ఉత్పత్తులను ఈ నౌక సీక్రెట్ గా తరలిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నౌక ఇతర పెద్ద ట్యాంకర్లలో ఇంధనం నింపేందుకు ఉపయోగిస్తున్నారు. ఫిబ్రవరి 22 నుంచి ముసందామ్ ప్రాంతంలో ఈ నౌకను లంగరు వేసి ఉంచినట్టు తెలుస్తోంది. ఒమన్ కు ఐదు మైళ్ల దూరంలో ఉన్న ఈ నౌకను ఇరాన్ (Iran) లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అలాగే ఇరాన్–ఒమాన్ మధ్య ఉన్న కీలక సముద్ర మార్గం హోర్ముజ్ స్రైట్స్ ను తాజాగా ఇరాన్ మూసేసింది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల నుంచి రోజూ భారీగా చమురు రవాణా జరుగుతుంది. అటు గల్ఫ్ దేశాల్లో పరిస్థితి భయానకంగా మారింది. ఇరాన్ వరుస దాడులకు పాల్పడుతోంది.

