భారత నౌకలకు ఊరట: ఇరాన్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణాన్ని అనుమతిస్తున్నట్లు ఇరాన్ (Iran) ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ కీలక జలసంధిని పూర్తిగా మూసివేయలేదని, భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్ వంటి స్నేహపూర్వక దేశాలకు మినహాయింపు ఇచ్చామని స్పష్టం చేశారు. తమతో సమన్వయం చేసుకునే దేశాల నౌకలను అనుమతించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్, ఈ ఘర్షణల్లో పాల్గొంటున్న గల్ఫ్ దేశాలకు చెందిన నౌకలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్నందున శత్రు దేశాలకు దారి ఇచ్చే ప్రసక్తే లేదని అరక్చీ తెలిపారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత హోర్ముజ్ (Hormuz) జలసంధిపై ఇరాన్ తన పూర్తి పట్టును నిరూపించుకుందని, ప్రపంచ దేశాలు ఇది కేవలం బెదిరింపు అని భావించినప్పటికీ, తాము పట్టుదలతో ఈ దిగ్బంధనాన్ని అమలు చేశామని ఆయన వివరించారు.

హోర్ముజ్ జలసంధి గుండా ప్రపంచవ్యాప్త చమురు, సహజ వాయువు సరఫరాలో 20 శాతం జరుగుతుంది. ఇరాన్ పాక్షిక దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారత్ తన ఎల్పీజీ దిగుమతుల్లో 90 శాతం ఈ మార్గం ద్వారానే పొందుతుండటంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడి సామాన్యులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇరాన్ (Iran) తాజా నిర్ణయంతో నందాదేవి, శివాలిక్ వంటి భారతీయ నౌకలు సురక్షితంగా తీరానికి చేరుకోవడంతో భారత్‌కు పెద్ద ఉపశమనం లభించినట్లయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>