కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముందే టికెట్ల ధరలు షాకిస్తున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఒక్కో టికెట్ ధర ఏకంగా లక్ష రూపాయల వరకు పలుకుతుండటం క్రీడాభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ భారీ ధరల కారణంగా సామాన్య అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను మైదానంలో చూసే అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అభిమానులకు పెద్ద సమస్యగా మారిందంటున్నారు.
వేసవి కాలంలో జరిగే ఈ లీగ్ కోసం స్టేడియాలు కిక్కిరిసిపోవడం సహజమే అయినా, ఈ స్థాయిలో ధరలు పెరగడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఐపీఎల్ క్రేజ్‌ను అడ్డుపెట్టుకుని టికెట్ల విక్రయాల్లో జరుగుతున్న ఈ పరిణామాలు క్రికెట్ లవర్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చుతున్నాయి. అత్యధిక డిమాండ్ ఉన్న మ్యాచ్‌లకు ఈ రకమైన ధరలు నిర్ణయించడం వల్ల ఆటలు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

