కలం, తెలంగాణ బ్యూరో: నిషేధిత భూముల జాబితా(22A Land)కు సంబంధించి 8 అంశాలకు పరిష్కారం అవసరం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే నిషేధిత జాబితా కొనసాగుతున్నదని, తమ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఎకరం కూడా ఈ జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. ఇకపై ఏదైనా భూమిని 22ఏ కింద చేర్చాలంటే సంబంధిత వ్యక్తి అభ్యంతరాలు, అవసరమైన రికార్డులను పరిశీలించి, విచారణ చేపట్టిన తర్వాతే నిషేధిత జాబితాలో చేర్చాలా? లేదా? అనే దానిపై సబ్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
ఆ నిర్ణయంపై అసంతృప్తి ఉంటే 60 రోజుల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని, ఆ తర్వాత 90 రోజుల్లో రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలో రికార్డులను పరిశీలించి భూముల స్థితిని నిర్ధారిస్తామని.. వాటిలో కొంత భాగం మాత్రమే వివాదాస్పదంగా ఉంటే, ఆ భాగాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో కొనసాగించి, మిగిలిన భూమిని జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.
నిషేధిత భూములు సగానికి తగ్గించాం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి నాటికి (2020 అక్టోబరు) మొత్తం 7,91,542 ఎకరాల మేర భూములు నిషేధిత జాబితాలో ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ విస్తీర్ణం 3,73,930 ఎకరాలకు తగ్గిందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పార్ట్-బీలోని వివాదాస్పద భూముల విస్తీర్ణాన్ని కూడా 17 లక్షల ఎకరాలకు తగ్గించగలిగామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 22ఏ నిషేధిత జాబితాను అప్‌డేట్ చేసి, పబ్లిక్ డొమైన్‌లో పెట్టేంత వరకు చాలా మందికి భూములు ఆ జాబితాలోకి వెళ్లిన సంగతే తెలియదని పేర్కొన్నారు.
ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ప్రజల డేటా
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల డేటాను ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధరణి కోసం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ అనే ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం.. ఆ తర్వాత టెరాసిస్, ఫాల్కన్ తదితర కంపెనీలకు అది చేతులు మారడంతో ప్రజల భూముల వివరాల డేటా మొత్తం ఆ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిందని వెల్లడించారు. రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన సుమారు 2.50 కోట్ల ఎకరాల భూముల రికార్డులు, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ ఖాతా నెంబర్లు, ఫోన్ నంబర్లతో సహా అన్నీ వాటి దగ్గరే ఉన్నాయన్నారు. రెవెన్యూ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి బదులు రికార్డులన్నింటినీ గత ప్రభుత్వం విదేశీ శక్తుల చేతుల్లో పెట్టిందని ఫైర్ అయ్యారు.
ధరణి అక్రమాలకు భూభారతితో చెక్
ధరణి (Dharani) పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను నిరోధించి ప్రజల ఆస్తుల్ని రక్షించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు. నిషేధిత భూములకు సంబంధించి 22ఏ సెక్షన్‌ను తమ ప్రభుత్వం తీసుకురాలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లోనే తొలిసారిగా ఉనికిలోకి వచ్చిందన్నారు. భూదాన్, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములను రక్షించడమే దీని ఉద్దేశమన్నారు.
Also Read : రష్యాపై అమెరికా ఉక్కుపాదం: భారత్ పరిస్థితేంటి?
Follow Us On: X(Twitter)

