ఆర్టీసీ బిగ్ ప్లాన్: మారనున్న బస్టాండ్ల రూపురేఖలు!

కలం, తెలంగాణ బ్యూరో: ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్ స్టేషన్ల రూపురేఖలను మార్చేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. బస్టాండ్లను కేవలం బస్సుల రాకపోకలకే పరిమితం చేయకుండా.. షాపింగ్, ఫుడ్, ఎంటర్‌‌టైన్‌మెంట్ వంటి సదుపాయాలు ఒకేచోట లభించేలా ‘ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ హబ్‌’లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని 13 ప్రాంతాల్లో కొత్తగా హైటెక్ బస్టాండ్ల (TGSRTC Bus Stands)ను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నది. ప్రయాణికులు బస్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ లేదా ఇతర ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా మల్టీ-మోడల్ కనెక్టివిటీని కూడా అభివృద్ధి చేయనున్నది. మొత్తానికి ఎయిర్‌పోర్ట్ తరహాలో ఆధునిక సదుపాయాలతో బస్టాండ్లను తీర్చిదిద్దాలని భావిస్తున్నది. నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెంలో నూతన బస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతున్నది. కొత్తగా నిర్మించే హైటెక్ బస్ స్టేషన్లలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, కమర్షియల్ స్పేస్‌లు, ఫుడ్ కోర్టులు, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో బస్సు కోసం ఎదురుచూసే సమయంలో ప్రయాణికులు.. ఈ సదుపాయాలను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

వ్యాపారవేత్తలకు ఆహ్వానం

నూతనంగా నిర్మిస్తున్న హైటెక్ బస్టాండ్లలో షాపింగ్ కాంప్లెక్స్‌లను వ్యాపారవేత్తలకు ఆర్టీసీ యాజమాన్యం కేటాయించనుంది. ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలు తమను సంప్రదించాలని సూచించింది. షాపుల కేటాయింపుకు సంబంధించిన దరఖాస్తు విధానం తదితర సమాచారాన్ని మేనేజ్‌మెంట్‌ దగ్గర పొందవచ్చని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>