కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మారుతి హోటల్‌లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం (PM Vishwakarma) లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. పీఎం విశ్వకర్మ యోజన జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ సభ్యుడు సామ రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పథకం అమలు, రుణాల వినియోగం, రెండో విడత ప్రయోజనాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద నిర్మల్ జిల్లాలో 1,800 మంది కుటుంబాలకు రూ.12 కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి రూ.1 లక్ష చొప్పున రుణంతోపాటు వృత్తికి అవసరమైన టూల్‌కిట్లు, కుట్టు మిషన్లు, చేతి పనిముట్లు అందజేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలోనే ఈ పథకం కింద రుణాలు మంజూరయ్యాయని, వాటిని సద్వినియోగం చేసుకుని తిరిగి చెల్లించిన లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. రెండో విడతలో ప్రతి అర్హుడైన లబ్ధిదారునికి రూ.2 లక్షల రుణం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విడతలో రుణం పొందాలంటే తప్పనిసరిగా 15 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

