కలం, స్పోర్ట్స్: ఎన్ఎండిసి (NMDC) తెలంగాణ ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో తమిళనాడుకు చెందిన కె ఎస్ అరిహంత్, తెలంగాణకు చెందిన ఆర్యా ద్వివేది విజేతలుగా నిలిచారు. సికింద్రాబాద్ క్లబ్‌లో బుధవారం జరిగిన పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్‌లలో వీరిద్దరూ అద్భుత ప్రదర్శనతో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల ఫైనల్ పోరులో టాప్ సీడ్ అరిహంత్ తన తోటి తమిళనాడు ఆటగాడు పిఆర్ సందేశ్‌పై విజయం సాధించారు.
ఐదు గేమ్స్ పాటు ఇరు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నడిచింది. చివరకు నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో అరిహంత్ పైచేయి సాధించి 11-7, 9-11, 11-3, 8-11, 11-5 తో మ్యాచ్‌ను ముగించారు. మరోవైపు మహిళల ఫైనల్స్‌లో టాప్ సీడ్ ఆర్యా ద్వివేది కేరళకు చెందిన బి ఎస్ శ్రేయపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్యా 11-9, 11-3, 11-7 తో వరుస గేమ్స్‌లో శ్రేయను ఓడించి ట్రోఫీని గెలుచుకున్నారు. వీరితో పాటు వివిధ వయసుల విభాగాల్లోనూ ఫైనల్స్ జరిగాయి.
బాయ్స్ విభాగంలో అగస్త్య ఉప్పల్ (అండర్-11), నిర్వాణ్ ఉప్పల్ (అండర్-13), ఫరీద్ ఆండ్రూబీ (అండర్-15), శ్రేష్ఠ్ అయ్యర్ (అండర్-17), రాహుల్ సంజయ్ బాలకృష్ణన్ (అండర్-19) తమ తమ మ్యాచ్‌లలో గెలిచి విజేతలుగా నిలిచారు. గర్ల్స్ విభాగంలో ఇనాయా ఆండ్రూబీ (అండర్-11), అరుణిమ చౌబే (అండర్-13), షనాయా రాయ్ (అండర్-15), వసుంధర నాంగ్రే (అండర్-17), వ్యోమిక ఖండేల్వాల్ (అండర్-19) టైటిళ్లు సాధించారు.
ఇక మాస్టర్స్ కేటగిరీలో ఆశిష్ కేస్కర్ (35 ప్లస్), ఆదిత్య మహేశ్వరి (45 ప్లస్), దీపక్ మూలాని (60 ప్లస్) విజయం సాధించారు. ఈ టోర్నమెంట్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకుని క్రీడాభిమానులను అలరించారు.

