కలం, వెబ్ డెస్క్: అజీర్తి (Indigestion) అనేది ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధించే సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యగా చెప్పుకోవచ్చు. మనం తినే ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అజీర్తి చేసినప్పుడు కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, వికారం, కడుపులో అసౌకర్యం వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. అయితే, ప్రతి చిన్న సమస్యకు ఇంగ్లీష్ మందులు వాడకుండా, మన వంటగదిలో లభించే సహజసిద్ధమైన వస్తువులతోనే దీనికి సులభంగా చెక్ పెట్టవచ్చని (Indigestion Relief) చెబుతున్నారు నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అజీర్తిని తగ్గించే గృహ చిట్కాలు
1. సోంపు గింజలు
అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు గింజలు అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ సోంపు గింజలను నమలడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని హెల్త్ లైన్ పేర్కొంది. సోంపులోని ఆరోమాటిక్ ఆయిల్స్ కడుపులో గ్యాస్ పేరుకుపోకుండా చూస్తాయట. దీనివల్ల అజీర్తి సమస్య త్వరగా అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.
2. గోరువెచ్చని నీరు+వాము
మన అమ్మమ్మల కాలం నాటి ఈ చిట్కా అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను క్షణాల్లో తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు. భోజనం తిన్న తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ వాము, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. వాములోని థైమోల్ అనే సమ్మేళనం కడుపు ఉబ్బరం, ఎసిడిటీని సమర్థవంతంగా తగ్గిస్తుందని చెబుతున్నారు.
3. అల్లం మజ్జిగ
అల్లం మజ్జిగ అనేది అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలను నివారించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఒక సహజ పానీయంగా చెప్పుకోవచ్చు. పండుగలు, శుభకార్యాల సమయంలో స్వీట్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు అల్లం మజ్జిగ తాగడం ఎంతో మంచిదని చెబుతున్నారు. దీనికోసం మజ్జిగలో కొద్దిగా అల్లం తురుము, జీలకర్ర పొడి కలిపి తాగితే జీర్ణక్రియ వేగవంతమై, కడుపు తేలికగా మారుతుందని చెబుతున్నారు.
4. పుదీనా టీ
అజీర్తి, గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగించేందుకు పుదీనా టీ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. పుదీనాలో ఉండే మెంథాల్ జీర్ణాశయ కండరాలను రిలాక్స్ చేస్తుందట. భోజనం తర్వాత పుదీనా టీ తాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
5. తగినంత నీరు తాగడం
మన శరీరంలో అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ముఖ్యంగ మసాలా ఫుడ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తిన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గి, జీర్ణక్రియ మందగిస్తుందట. కాబట్టి, అలాంటి ఆహారాలు తిన్నప్పడు తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.
6. ధనియాల కషాయం
ధనియాల కషాయం అనేది అజీర్తి, కడుపునొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే సాంప్రదాయ ఆయుర్వేద నివారణ అని చెబుతున్నారు నిపుణులు. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా తాగడం వల్ల కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.
7. లేట్ నైట్ ఫుడ్ తినొద్దు
రాత్రి వేళల్లో ఆలస్యంగా ఆహారం తినడం అనేది అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలకు ప్రధాన కారణం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పండుగ రోజుల్లో లేదా వేడుకల సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అర్ధరాత్రి పూట ఎక్కువగా తింటూ ఉంటారు. కాబట్టి రాత్రి వేళల్లో త్వరగా తినడం అలవాటు చేసుకోవాలని చెబతుఉన్నారు.
8. మరుసటి రోజు లైట్ ఫుడ్ తినండి
శుభ కార్యాలు, పండుగ రోజుల్లో విందు భోజనాలు, హెవీ ఫుడ్స్ తిన్నట్లయితే, ఆ తర్వాతి రోజు చాలా తేలికపాటి ఆహారం లేదా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల జీర్ణాశయంపై ఒత్తిడి తగ్గి, పొట్టకు కాస్త విశ్రాంతి దొరుకుతుందని చెబుతున్నారు.
9. వజ్రాసనం
ఆహారం తిన్న వెంటనే 5 నుంచి 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ ఆసనం వేయడం వల్ల పొత్తికడుపు భాగంలో రక్తప్రసరణ పెరిగి, తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణం అవుతుందట.
Note: ఈ సమాచారం కేవలం పాఠకుని ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇవి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అజీర్తి సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించగలరు.

